గుండె చెరువు..!
eenadu telugu news
Published : 21/10/2021 06:23 IST

గుండె చెరువు..!

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

అతి వేగం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. నిర్లక్ష్యం.. ఆ కన్నోళ్ల ఆశలను చిదిమేసింది.. ఆరేళ్లకే నూరేళ్లూ నిండేలా చేసింది.. బుడిబుడి నడకలతో బడికి వెళుతున్న బిడ్డను చూసి మురిసిన తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది.. అమ్మా వెళ్లొస్తా.. అంటూ వెళ్లిన తన ఆరో ప్రాణం ఇక తిరిగిరాని లోకాలకు తరలిపోయిందనే చేదు వార్తతో ఆ తల్లి గుండె కన్నీటిసంద్రమైంది....ఎచ్చెర్ల మండలంలో చెరువులో బస్సు బోల్తా పడి బాలుడు మృతిచెందిన హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.. 

బడివానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి రాము, నీలవేణి దంపతుల కుమారుడు రాజు (6). ఎప్పట్లాగే ఉదయాన్నే తాను చదువుతున్న ప్రైవేటు బడి బస్సులో కొంగరాంకు బయలుదేరాడు. కొయ్యాం పంచాయతీ నిమ్మవానిపేట సమీపంలోని నల్లచెరువు వద్దకు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు ఒరిగిన వైపు కూర్చున్న రాజు ఇరుక్కుపోవడంతో ప్రాణాలొదిలాడు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. రాజు తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. తండ్రి రాము ఉపాధి కోసం వలస వెళ్లారు. తల్లి దివ్యాంగురాలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరినీ చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. తల్లి నీలవేణి ఇంటి వద్దే ఉంటూ ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా చూసుకొంటుంది. ఇంతలో ఈ దారుణం చోటుచేసుకుంది.

రాజు (పాత చిత్రం)

ఆ అయిదుగురు మృత్యుంజయులు.. : ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవరు గనగళ్ల కృష్ణ అక్కడి నుంచి పారిపోయి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. బస్సులో రాజుతో సహా బడివానిపేటకు చెందిన ముగ్గురు, మూసవానిపేటకు చెందిన ముగ్గురు ఉన్నారు. రాజు ఒక్కడే ప్రాణాలు దక్కించుకోలేక పోయాడు. రెండోవైపు కూర్చున్న ఐదుగురు మాత్రం కిటికీల గుండా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారో తెలియక ఆందోళన నెలకొంది. క్రేన్‌ సాయంతో సుమారు 2 గంటల పాటు శ్రమించి చెరువులో నుంచి బస్సును బయటకు తీశారు.

అతివేగమే కారణమా..! ఎచ్చెర్ల మండలంలోని బడివానిపేట నుంచి కొయ్యాం మీదుగా ప్రధాన రహదారి ఉంది. వాహన రాకపోకలన్నీ ఇటువైపే సాగుతున్నాయి. కానీ డ్రైవరు మాత్రం అడ్డదారిలో వేగంగా పాఠశాలకు చేరుకోవాలనే తొందరపాటు, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు, ఎస్పీ అమిత్‌ బర్దార్‌, సీఐ చంద్రశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎచ్చెర్ల ఎస్సై కె.రాము బస్సు డ్రైవరుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చివరి చూపునకూ నోచుకోని తండ్రి : గుజరాత్‌లో చేపల వేటకు వలస వెళ్లిన తండ్రి రాము సముద్రంలో ఉండటంతో ఫోన్‌ సిగ్నల్‌ లేక కుమారుడి మరణవార్త తెలియలేదు. దీంతో తండ్రి లేకుండానే రాజు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. చివరి చూపునకు కూడా తండ్రి నోచుకోని పరిస్థితి గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.

 


బడి బస్సులు గాలిలో ప్రాణాలు..!

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)

గత సెప్టెంబరు 25న ఎల్‌ఎన్‌పేట మండలం జాడుపేట వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు

ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం వద్ద పాఠశాల బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఈ ఘటనకు డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి బస్సుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఆయా యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

కరోనా తర్వాత జిల్లాలో ఇటీవలే పాఠశాలలు తెరుచుకున్నాయి. కొన్ని యాజమాన్యాలు విద్యార్థుల కోసం బస్సులు నడుపుతున్నాయి. కానీ వాటి సామర్థ్యం(ఫిట్‌నెస్‌), నైపుణ్యం కలిగిన చోదకుల నియామకం, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మాత్రం పాటించడం లేదు. కరోనా సాకుగా చూపి సాధారణ వాహనాలకు రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, ఇతర ధ్రువపత్రాల గడువును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మూడు నెలలకోసారి పెంచుకుంటూ పోతున్నారు. దాదాపుగా రెండేళ్లుగా చాలా బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. అధికారులు అడిగినా ప్రభుత్వాల మినహాయింపులను చూపి పాఠశాలల యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయి. ఇదే అదనుగా కొన్ని పాఠశాలలు నెలల తరబడి నిర్వహణ లేకుండా పక్కన పెట్టేసిన బస్సులను బూజులు దులిపి తిప్పేస్తున్నారు.


అన్నీ ఉంటేనే ధ్రువపత్రం...

బస్సుల సామర్థ్య ధ్రువపత్రం పొందేందుకు ఏటా మే, జూన్‌ నెలల్లో ఆన్‌లైన్‌లో నిర్దేశించిన చలానా రుసుం చెల్లించి వాహనాన్ని రవాణాశాఖ కార్యాలయానికి తీసుకువెళ్లాలి. అక్కడ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టరు పరిశీలించి అన్నీ బాగుంటే సామర్థ్య ధ్రువపత్రం జారీ చేస్తారు.


ఇవి తప్పనిసరి...

ఇంజిన్‌, బ్రేకులు, లైట్లు సక్రమంగా పని చేయాలి. ప్రథమ చికిత్స పెట్టె, అగ్నిమాపక యంత్రం, ఇతర ప్రధాన సదుపాయాలు ఉండాలి. డ్రైవర్‌ వయసు 50 ఏళ్లు దాటకూడదు. 15 ఏళ్ల సర్వీసు మించిన వాహనం పనికిరాదు. పిల్లలను బస్సులోకి ఎక్కించడం, దించేందుకు ఓ వ్యక్తిని నియమించాలి. సూచికలు, హెచ్చరిక బోర్డులు, పాఠశాల వివరాలు, సంబంధిత ఫోన్‌ నంబర్లు అన్నీ స్పష్టంగా ఉండాలి. వీటిలో కొన్నే సక్రమంగా ఉంటుండటంతో ప్రమాదాలు దరిచేరుతున్నాయి.

తల్లిదండ్రులు కూడా బస్సుల నిర్వహణ తీరుతెన్నూ పరిశీలించాలి. సమస్యలుంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.


వసూళ్లు సరే... జాగ్రత్తలెక్కడ?

జిల్లాలో దాదాపు 2,487 పాఠశాల బస్సులున్నాయి. అవి శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ, నరసన్నపేట, టెక్కలి, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాల పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు నిత్యం ఎంతో మంది విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. బస్సు ఫీజులు మాత్రం కచ్చితంగా వసూలు చేస్తున్నారు. కొవిడ్‌ నష్టాల పేరుచెప్పి కొన్ని యాజమాన్యాలు అధిక వసూళ్లకూ పాల్పడుతున్నాయి. కానీ పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పట్టించుకోవట్లేదు. దీనిపై ఎవరూ ప్రశ్నించడం లేదు. అధికారులు వీటిపై దృష్టి సారించకపోవడంతో అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటోంది.


తనిఖీలు చేస్తూనే ఉన్నాం...

- ఎం.మాంధాత్‌, ఇన్‌ఛార్జి డీటీసీ, శ్రీకాకుళం

కొవిడ్‌ కారణంగా వాహనాల అనుమతుల గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. ఇటీవల పాఠశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. కానీ ఎక్కడికక్కడ సాధారణ తనిఖీలు చేస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో కొన్ని బస్సుల సామర్థ్యాన్నీ పరీక్షిస్తున్నాం. బుధవారం ఎచ్చెర్ల మండలంలో జరిగిన సంఘటనపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాం. బస్సు సామర్థ్యం, డ్రైవర్‌ నైపుణ్యంపైనా ఆరా తీశాం. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపించి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని