ఏళ్ల తరబడి ఖాళీలే..!
eenadu telugu news
Published : 21/10/2021 06:31 IST

ఏళ్ల తరబడి ఖాళీలే..!


వర్షం నీటిలోనే సేవలు అందిస్తున్న పశువైద్యులు

న్యూస్‌టుడే-కలెక్టరేట్‌(శ్రీకాకుళం), సరుబుజ్జిలి, పొందూరు: పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో పాడిపై ఆధారపడిన రైతు కుటుంబాలు అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సేవలందడం లేదు. గ్రామాల్లో పశువైద్య కేంద్రాలు ఉన్నప్పటికీ సిబ్బంది కొరతతో పాటు మందులు అందుబాటులో ఉండటం లేదు. ఏళ్లుగా పశువైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి చర్యలు తీసుకోవడం లేదు. అందే పథకాలు తగ్గించడంతో పాటు చేయూత ఇవ్వకపోవడంతో పాడిపరిశ్రమ అభివృద్ధి నత్తనడకన సాగుతోంది.


పాలకొండలోని శిథిలావస్థలో ఉన్న పశువైద్యశాల...

పశువైద్యశాలల్లో బిక్కుబిక్కు..: జిల్లాలోని పలు పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోక అవస్థలకు గురవుతున్నారు. వర్షం పడే సమయాల్లో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. 12 ప్రాంతీయ వెటర్నరీ ఆసుపత్రులు, 58 వెటర్నరీ డిస్పెన్సరీలు, 50 రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో వీటి స్థానంలో నూతనంగా నిర్మించేందుకు నాడు-నేడు ద్వారా ప్రతిపాదనలను పంపారు.


అరకొర వైద్యసేవలు

జిల్లాలోని 38 మండలాల్లో బహువిధ పశువైద్యశాల-1, వెటర్నరీ పశువైద్య ఆసుపత్రులు 19, వెటర్నరీ డిస్పెన్సరీలు-98, గ్రామీణ పశువైద్యశాలలు- 80, రైతు భరోసా కేంద్రాలు-820 ఉన్నాయి. సగం సిబ్బందితోనే పశుసంవర్ధక శాఖ నడుస్తోంది. సుమారుగా సంయుక్త సంచాలకులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు చూస్తే 1135 మంది ఉండాల్సి ఉండగా 564 ఖాళీలు ఉన్నాయి. అధికారుల పరిశీలన కరవవడంతో రెండు లేదా మూడు రోజులకోసారి వైద్యులు వచ్చి తలుపులు తెరిచి మమ అనిపించుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో వివిధ రోగాల బారిన పడిన పశువులకు సకాలంలో వైద్య సేవలందక మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: భవన మరమ్మతులు, నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. నాడు-నేడులో ప్రతిపాదనలను పంపాం. వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్పరీలు తదితర వాటి నూతన నిర్మాణాలకు సంబంధించి రూ.42.41 కోట్లతో ప్రతిపాదనలను పంపాం. వివిధ మరమ్మతులకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి అంచనాలతో పంపించాం. ఖాళీల భర్తీ ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. కొత్తగా నియామకాల ద్వారా భర్తీ కావాల్సి ఉంది.

- ఎం.కిశోర్‌, సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని