ఆలోచనా విధానం మారితేనే అధిక దిగుబడులు
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

ఆలోచనా విధానం మారితేనే అధిక దిగుబడులు

మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, చిత్రంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రైతుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకువస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. జిల్లా పరిషత్తు సమావేశమందిరంలో వరి మాగాణుల్లో అపరాల ఉత్పాదకత పెంచేందుకు కార్యాచరణపై శాస్త్రవేత్తలతో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు వరి తరువాత అపరాలను సాగు చేసి దిగుబడులు సాధించేలా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా చూడాల్సిన బాధ్యత శాఖ అధికారులపై ఉందన్నారు. ఆ మేరకు రైతులను చైతన్యపరచాలన్నారు.

అపరాల ప్రాధాన్యం తెలుసుకోవాలి...

అనంతరం విశ్రాంత విస్తరణ సంచాలకులు ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ ఒకే పంట పండిస్తే నేలలో సారం తగ్గుతుందన్నారు. అపరాలకు భూమిని సారవంతం చేస్తే శక్తి ఉందని, దాని ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలని కోరారు. ప్రపంచ దేశాలను భారత్‌ నుంచే పెసలు, మినుములు ఎగుమతి అవుతున్నాయన్నారు. అపరాల సాగుకు సంబంధించి యాజమాన్య పద్ధతులు, పంట రకాలను వివరించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ సుమిత్‌కుమార్‌, వ్యవసాయ మండలి ఛైర్మన్‌ శివాజీ, వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్‌, వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు నేతాజీ, అగ్రిమిషన్‌ సభ్యుడు గొండు రఘురాం, వ్యవసాయ శాస్త్రవేత్తలు పీవీవీ సత్యనారాయణ, చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని