నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు
eenadu telugu news
Published : 24/10/2021 06:20 IST

నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ, ప్రింటరు

బొబ్బిలి, న్యూస్‌టుడే: నకిలీ కరెన్సీ నోట్ల చలామణికి యత్నించిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు బొబ్బిలి సర్కిల్‌ కార్యాలయంలో డీఎస్పీ మోహనరావు వివరాలు వెల్లడించారు. వీరఘట్టానికి చెందిన కర్రి గణపతి, సంతోష్‌ మారు వ్యాపారులుగా చెబుతూ ఈనెల 19న బలిజిపేట సంతలో శివడవలసకు చెందిన జాడ సోములు నుంచి రెండు గొర్రెలను 12,500కు కొనుగోలు చేశారు. వీరు నకిలీ నోట్లు రూ.11,500 చెల్లించి మరో రూ.వెయ్యి తర్వాత ఇస్తామని సోములను నమ్మించారు. ఇదే మొత్తంతో సోములు మరుసటి రోజు మానాపురం సంతకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేశాడు. నోట్లను చూసి అనుమానంతో కొనుగోలుదారుడు నిరాకరించారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన సోములు బలిజిపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బొబ్బిలి గ్రామీణ సీఐ శోభనబాబు తన బృందంతో దర్యాప్తు నిర్వహించారు. ఈ వ్యవహారంలో వీరఘట్టానికి చెందిన త్రాసుల సంగమేశ్వరరావు, తూముల సింహాచలం సూత్రధారులుగా గుర్తించారు. సంగమేశ్వరరావు బంధువు విశాఖ జిల్లా భీమిలికి చెందిన త్రాసుల సూర్యనారాయణ ఇందులో కీలక సూత్రధారిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఆయనే నోట్లను మ³ద్రిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. చిన్న నోట్లు అయితే ఎవరికీ అనుమానం రాదని కేవలం రూ.100, రూ.200 నోట్లు ముద్రిస్తున్నారని, సంతల్లో నిరక్షరాస్యులే లక్ష్యంగా చలామణి చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నోట్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ, ఎస్సైలు జ్ఞానప్రసాద్‌, సూర్యనారాయణ, సిబ్బంది మురళి, రమణ, రాంబాబు, శేఖర్‌లను డీఎస్పీ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని