పలాస పారిశ్రామికవాడ.. వసతుల్లో కడ!
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

పలాస పారిశ్రామికవాడ.. వసతుల్లో కడ!


కాశీబుగ్గ పారిశ్రామిక వాడలోని ఓ ప్రాంతం

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: అనుకున్నంత కాకపోయినా.. కాశీబుగ్గ పారిశ్రామిక వాడలో ప్రస్తుతం 40 వరకు జీడి కర్మాగారాలు.. 10 వరకు జీడినూనె పరిశ్రమలు ఉన్నాయి. సుమారు మూడు వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఏటా రూ.30 నుంచి 35 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వానికి పన్ను రూపేణా రూ. లక్షలు సమకూరుతున్నాయి. అలాంటి ప్రాంతంలో ఎలాంటి సౌకార్యాలుండాలి. వాడ ఏర్పడి 35 ఏళ్లు కావస్తున్నా మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా అంగలారుస్తూనే ఉంది. వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణం లేక కార్మికులూ ఇబ్బందులు పడుతున్నారు.

 

నాడు..: ఎటు చూసినా తారు రహదారులు.. నిరంతర వెలుగులు వెదజల్లే వీధి దీపాలు.. ఎక్కడా మురుగు నిలవకుండా చక్కటి కాలువ వ్యవస్థ.. వృథా, చెత్త నిల్వలేకుండా చర్యలు... చూస్తేనే ఆహ్లాదం కలిగేలా.. పచ్చని చెట్లతో దర్శనమిచ్చేలా.. పనిచేయాలనే తపనను పెంచేలా.. పర్యావరణానికి ఎలాంటి నష్టమూ కలిగించకుండా. ఓ చక్కటి పారిశ్రామికవాడ ఏర్పాటు కాబోతోంది. ఇదీ మూడు దశాబ్దాల కిందట పలాస వాసుల కల.

నేడు: వాహనదారులకు నరకం చూపేలా గోతులు తేలిన రహదారులు.. మట్టితోపూడిపోయిన కాలువలు..రహదారులపైకి చేరుతున్న వ్యర్థాలు... పాములకు ఆవాసంగా మారిని పనికిరాని మొక్కలు.. శిథిలావస్థకు చేరిన నీటిట్యాంకు.. పారిశ్రామికవాడకు ఉండాల్సిన ఒక్క లక్షణమూ లేకుండా కునారిల్లుతున్న వైనం నేటిది.


పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న పార్క్‌ కోసం కేటాయించిన స్థలం

 

ఏపీఐఐసీ ఏం చేస్తున్నట్టో..: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పనా సంస్థ(ఏపిఐఐసీ) పారిశ్రామికవాడ పర్యవేక్షణ చూస్తుంది. ఇక్కడ ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన తారు రహదారులు ప్రస్తుతం పాడయ్యాయి. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం లేదు. వ్యర్థ ద్రవాలు రహదారులపైకి చేరుతున్నాయి. నీటిట్యాంకు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. పార్క్‌ ఏర్పాటుకు కేటాయించిన స్థలం చుట్టూ గోడ నిర్మాణం చేపట్టి మూడేళ్లుగా వదిలేశారు. దీంతో ఈ స్థలం పనికిరాని మొక్కలకు నిలయమైంది. మరో వైపు కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ ప్రాంతాన్నే మరుగుదొడ్లుగా వాడుతున్నారు. కర్మాగారాలు నుంచి వస్తున్న వ్యర్ధాలను ఈ స్థలంలో వేసేస్తున్నారు. దీంతో డంపింగ్‌ యార్డుగా మారిపోయింది.

‘ఐలా’గా గుర్తించేదెప్పుడు? పారిశ్రామికవాడను ఐలా(ఇండస్ట్రియల్‌ లోకల్‌ అథారిటీ)గా గుర్తించాలని గత కొన్నేళ్లుగా వ్యాపారులు కోరుతున్నారు. అయినప్పటికీ ఇంతవరకు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఐలాగా గుర్తిస్తేనే అన్ని రకాల సౌకర్యాలు కల్పన జరుగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ప్రతిపాదనలు లేవు: కాశీబుగ్గ పారిశ్రామికవాడలో తాజాగా పనులు చేపట్టేందుకు ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు చేపట్టలేదు. ఐలా ఏర్పాటుకు మా వంతుగా కృషి చేస్తాం. వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

- పాపారావు, ప్రాంతీయ మేనేజర్‌, ఏపీఐఐసీ శ్రీకాకుళం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని