వినతులను పరిశీలిస్తాం: బి.సి. కమిషన్‌ ఛైర్మన్‌
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

వినతులను పరిశీలిస్తాం: బి.సి. కమిషన్‌ ఛైర్మన్‌


మాట్లాడుతున్న శంకరనారాయణ, చిత్రంలో కమిషన్‌ సభ్యులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాల వారు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన న్యాయం చేకూర్చేందుకే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల కమిషన్‌ పనిచేస్తుందని ఛైర్మన్‌ ఎ.శంకరనారాయణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో బి.సి. జాబితాలో చేర్పులు, బదలాయింపు వంటి అంశాలపై సభ్య కార్యదర్శి డి.చంద్రశేఖర్‌రాజు, సభ్యులు అవ్వరు ముసలయ్య, మరక్కగిరి కృష్ణప్ప, గౌత్రీ వెంకటసత్యదివాకర్‌ పక్కిలతో కలిసి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ కొన్ని కులాలు, వర్గాలకు చెందిన వారు వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని, కొంతమంది తమను గ్రూపు మార్చమని కోరారన్నారు. వీరంతా తమ సమస్యలను ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 23 కులాలను అత్యంత వెనుకబడిన తరగతులుగా గుర్తించి వాటిని ఒక ప్రత్యేకమైన గ్రూపుగా పరిగణించేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ కోరారు.

వెల్లువెత్తిన విజ్ఞప్తులు

బహిరంగ విచారణలో భాగంగా కమిషన్‌ కి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కళింగ సేవాసమితి తరఫున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, మాజీ ఎమ్మల్యేలు కూన రవికుమార్‌, పిరియా సాయిరాజ్‌, సమితి అధ్యక్ష, కార్యదర్శులు, కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ పేరాడ తిలక్‌ వినతి అందించారు. కండ్ర కులస్థుల తరఫున గయా రామచంద్రబెహరా, భీమోబెహరా, మత్స్యకారుల సంఘ నాయకులు ఎ.హనుమంతరావు, తూర్పుకాపు, చాత్తాద శ్రీవైష్ణవ, కృష్ణబలిజ, వెలమ, నగర కులాల నుంచి విజ్ఞప్తులు అందాయి. నాయీబ్రాహ్మణ, తెలగ సంక్షేమ, శిష్టకరణ సంఘం, విశ్వబ్రాహ్మణల తరఫున ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు. అంతకముందు జిల్లాకు వచ్చిన కమిషన్‌ బృందాన్ని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌బర్దార్‌, జేసీ శ్రీనివాసులునాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. బీసీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.


గుమిగూడిన వివిధ కులసంఘాల ప్రతినిధులు

పలువురి నిరసన : పలు సామాజిక వర్గాల ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడంతో గందరగోళం నెలకొంది. ఆహ్వానించిన తమను కాదని ఇతరుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం, తమను లోపలికి అనుమతించకపోవడంతో కొన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు హాలు బయట నిరసన కూడా వ్యక్తం చేశారు. ఓ వర్గ ప్రతినిధుల మాట్లాడుతుంటే మరో వర్గానికి చెందిన వారు అడ్డుతగలడంతో బహిరంగ విచారణ ప్రయోజనకరంగా జరగలేదన్న వాదన వినిపించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని