మూలకు చేరిన సంరక్షణ కిట్లు
eenadu telugu news
Updated : 26/10/2021 04:20 IST

మూలకు చేరిన సంరక్షణ కిట్లు

 

కాన్పు అనంతరం బాలింతలకు సరఫరా చేయాల్సిన బసవతారకం మదర్‌ కిట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో మూలకు చేరాయి. గత ప్రభుత్వ హయాంలో ఇవి సరఫరా అయ్యాయి. ఆసుపత్రి నూతన భవనంలోని ఓ గదిలో వందవరకు కిట్లు ఇలా దర్శనమిచ్చాయి.వీటిని పంపిణీ చేయకుండా మూలన పెట్టేయడంతో చెదలు పట్టాయి. ఒక్కో కిట్‌లో చీర, బ్లాంకెట్‌, రెండు ఉలెన్‌ స్కార్ప్స్‌, 450 మి.లీ. పరిమాణంతో స్టీల్‌ థర్మోస్‌ ఫ్లాస్క్‌, 40 శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉంటాయి. ప్రభుత్వం మారాక వీటిని సరఫరా చేయొద్దని ఆదేశాలు రావడంతోనే అలాగే ఉంచేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కణితి కేశవరావు తెలిపారు.

- న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం


వంతెన.. ప్రమాదపుటంచున!

చిత్రం చూస్తే ఇదేదో వినియోగించకుండా వదిలేసిన పాతవంతెన అనుకుంటున్నారా.. అదేం కాదండి... ఇచ్ఛాపురం మండలంలో రాష్ట్రానికే శివారు మత్స్యకార గ్రామాలైన డొంకూరు, పెద్దలక్ష్మిపురం, చిన్నలక్ష్మిపురం, శివకృష్ణాపురం తదితర గ్రామాలకు ఈ వంతెనమీద నుంచే వెళ్లాలి. సుమారు నాలుగు వేల మంది జనాభాకి ఉప్పుటేరు దాటాలంటే ఇదే ఆధారం.. నిత్యం వందల సంఖ్యలో ఆటోలు, ద్విచక్రవాహనాలు తిరుగుతుంటాయి. ఉప్పుగాలులకు పిల్లర్ల ఇనుప చువ్వలు సైతం దెబ్బతినేశాయి. ఎప్పుడు కూలుతుందో అన్నట్టున్న ఈ వంతెనపై ప్రాణాలరచేతపట్టుకుని వీరు ప్రయాణం సాగిస్తున్నారు.


అడుగు భాగంలో ఇలా..

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం


త్రుటిలో తప్పిన ప్రమాదం

జాతీయ రహదారిపై చీపుర్లపాడు వద్ద సోమవారం వేకువజామున ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా డివైడర్‌ పైకి దూసుకువచ్చింది. కుడివైపునకు ఒక్క ఉదుటున వచ్చి డివైడర్‌ పైకి చేరి నిలిచిపోయింది. ఎడమవైపున రోడ్డుపై రోజూ కాయగూరల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఇటువైపు కాని, దూసుకొని వచ్చివుంటే పెద్దప్రమాదమే చోటుచేసుకునేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ జరుగుతున్న రైతుల కాయగూరల విక్రయాలను ప్రమాదాలు లేనిచోటుకు మార్చాలని పలువురు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, చీపుర్లపాడు(కోటబొమ్మాళి)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని