నత్తనడకన విస్తరణ పనులు
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

నత్తనడకన విస్తరణ పనులు

ఎంపీడీవో కార్యాలయం సమీపంలో కాలువ నిర్మాణానికి సన్నాహాలు

జిల్లావ్యాప్తంగా పలు పెద్ద పంచాయతీల్లో రోడ్ల విస్తరణలో భాగంగా భవనాల తొలగింపు పనుల ప్రక్రియ పూర్తి అయ్యింది. నరసన్నపేట మేజర్‌ పంచాయతీతో పాటు వీరఘట్టం, పాతపట్నం పంచాయతీలతో పాటు పలాస పట్టణంలో అధికారులు ఇటీవల ఆక్రమణలు తొలగించి రోడ్లను విస్తరించారు. వీటిలో ఒకటైన నరసన్నపేట ప్రధాన రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులకు ర.భ.శాఖ నడుం బిగించింది. అయితే తదుపరి పనుల నిర్వహణ నత్తనడకన సాగుతున్నాయి.

- న్యూస్‌టుడే, నరసన్నపేట

నరసన్నపేట మేజర్‌ పంచాయతీ పరిధిలోని మారెట్‌ కమిటీ నుంచి సత్యవరం కూడలి వరకు ప్రధాన రోడ్డును విస్తరించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ రెండేళ్లుగా కృషి చేస్తున్నారు. ఆయన ర.భ.శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిధులు మంజూరయ్యాయి. ప్రధాన రోడ్డు సుందరీకరణ, విస్తరణకు రూ.4.5 కోట్లు నిధులు మంజూరవగా, గతేడాది నవంబరులో పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌ 10న ప్రధాన రోడ్డును ఆనుకొని ఉన్న దుకాణాలు, భవనాలను తొలగించారు. తీరా మంజూరైన నిధులు తక్కువ కావడంతో అదనపు నిధులకు రూ.10.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో నెలలతరబడి పనులు ప్రారంభం కాలేదు. భవనాలు, దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు, బాధితుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. భవనాలు కోల్పోయిన బాధితులు తదుపరి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. అయినా గుత్తేదారు పనులు వేగవంతం చేయకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఆగమేఘాల మీద తొలగించి...

నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఆగమేఘాల మీద తొలగించి తీరా నిర్మాణాల్లో శ్రద్ధ చూపకపోవడం తగదని వాపోతున్నారు. ముఖ్యంగా కాలువల సదుపాయం లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డు పైౖకి చేరి దుర్గందభరితంగా ఉంది. కంబకాయ కూడలి వద్ద ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిందే. అసంపూర్తి నిర్మాణాల వల్ల దుకాణాలకు వెళ్లాలంటే కర్ర వంతెనపై నడవక తప్పని పరిస్థితి. భవనాలు తొలగించిన నాలుగు నెలల తరువాత పనులు ప్రారంభించేందుకు గుత్తేదారు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయం ఆవరణ నుంచి కాలువ నిర్మాణంతో పనులు ప్రారంభమయ్యాయి. రెండువైపులా కాలువలతో పాటు సెంటర్‌ లైటింగ్‌ వంటి సుందరీకరణ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని నరసన్నపేట వాసులు ఎదురుచూస్తున్నారు.


డిసెంబరుకు నాటికి పూర్తి చేస్తాం ..


దుకాణాలకు వెళ్లాలంటే ఈ కర్రవంతెనలు ఎక్కాల్సిందే

నరసన్నపేట ప్రధాన రోడ్డు విస్తరణ పనులు డిసెంబరు నాటికల్లా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఇసుక అందుబాటు లేకపోవడంతో పనుల ప్రారంభంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం కాలువల నిర్మాణపనులు వేగవంతం చేశాం. మరో రూ.10.5 కోట్లతో పనులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. అవి వస్తే సత్యవరం కూడలి నుంచి మార్కెట్‌ కమిటీ వరకు రోడ్డు విస్తరణ పూర్తవుతుంది.

- రాజశేఖర్‌, ఏఈ, ర.భ.శాఖ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని