పురుగుల మందు తాగి వ్యక్తి బలవన్మరణం
eenadu telugu news
Published : 26/10/2021 04:21 IST

పురుగుల మందు తాగి వ్యక్తి బలవన్మరణం

లావేరు గ్రామీణం, న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన లావేరు మండలంలో సోమవారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతకుంకాం గ్రామానికి చెందిన అదపాక శ్రీను(33) మద్యానికి బానిసయ్యాడు. నిత్యం ఇంటికి తాగొచ్చేవాడు. దీనిపై భార్య, తల్లిదండ్రులు మందలించేవారు. ఇదే విషయమై ఆదివారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య లక్ష్మి సోమవారం ఉదయం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు పంటల కోసం తెచ్చిన పురుగుల మందు తాగి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ కె.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పూండి-బెండిగేటు మధ్య కవిటి అగ్రహారం సమీపంలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. పలాస రైల్వే పోలీసులు సోమవారం మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 48-50 ఏళ్ల మధ్య వయసు ఉండి ఎడమ చేతిపైన ఒడియా భాషలో పచ్చబొట్టు, ఎడమచేతి వేలికి బంగారం రంగు కలిగిన ఉంగరం ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం వేకువజాము అప్‌లైన్‌లో ఈ ఘటన జరిగినట్లు వివరించారు. ఈ మేరకు జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్‌ఆర్‌ షరీఫ్‌ కేసు నమోదు చేశారు.

 


గోదావరిలో యువకుడి గల్లంతు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: చినవంక గ్రామానికి చెందిన మదనాల నిత్తు(23) గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వారం రోజుల కిందట రాజమండ్రిలోని డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందేందుకు నిత్తు వెళ్లాడు. సోమవారం తోటి స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి దిగాడు. ఒక్కసారిగా వరద ఉద్ధృతంగా రావడంతో నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నిత్తు తల్లిదండ్రులు మదనాల కుమార్‌స్వామి, మోహిని. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి సీఆర్పీఎఫ్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు గల్లంతయ్యాడన్న వార్తతో వారు బోరున విలపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని