శిథిల సేతువు.. ప్రమాద హేతువు
eenadu telugu news
Published : 26/10/2021 04:33 IST

శిథిల సేతువు.. ప్రమాద హేతువు

టెక్కలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వంతెనలు ఉన్నా, ఏళ్లక్రితం నిర్మించినవి కావడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నేళ్లుగా ఎక్కువ బరువున్న లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో వంతెనలు శిథిలమవడానికి కారణమయ్యాయి. రక్షణగోడలు ధ్వంసమవడంతో పాటు, పిచ్చిమొక్కలు మొలిచి వంతెనలు బీటలు వారి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో వంతెనల దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

వీటికి మోక్షమెన్నడో..?

నందిగాం: మండలంలోని నందిగాం-పూండి రోడ్డుపై నారాయణపురం, కణితివూరు గ్రామాల సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై 1988లో నిర్మించిన 2 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నారాయణపురం సమీపంలో వంతెన 2018లో కూలిపోయింది. హరిదాసుపురం-ఆనందపురం రోడ్డుపై వంశధార ప్రధాన ఎడమకాలువపై 1988లో ఆనందపురం సమీపంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెనలపై నడిచి వెళ్లాలన్నా, వాహనాలపై వెళ్లాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఈ వంతెనల స్థానంలో కొత్తవి పునర్నిర్మించాలంటున్నారు.

జోరుగా వరదనీటి ప్రవాహం

సంతబొమ్మాళి: మండలంలో బోరుభద్ర-వడ్డివాడ, నౌపడ-సీతానగరం, సంతబొమ్మాళి-కోటబొమ్మాళి, పాలనాయుడుపేట-మూలపేట రోడ్ల వంతెనలు పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించలంటే వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు. పలుచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. వరదలు వచ్చే సమయంలో ఈ వంతెనలపై నుంచి జోరుగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త వంతెనలు ఏర్పాటుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


రక్షణ గోడలు ధ్వంసం


బొరిగిపేట వద్ద దెబ్బతిన్న వంతెన

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : టెక్కలి మండలంలోని పలు ప్రధాన మార్గాల్లోని వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి ఏళ్లతరబడి నిర్వహణ లేకపోవడంతో నిత్యం భయపెడుతున్నాయి. ప్రధానంగా సీతాపురం-భీంపురం మార్గంలో బొరిగిపేట వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలమైంది. వంతెనపై వర్షం నీరు నిలిచిపోతుండటం, రక్షణగోడలు ధ్వంసమవడంతో అది ఏ క్షణాన కూలుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. టెక్కలి-భగవాన్‌పురం మార్గంలో వంశధార 48ఆర్‌ కాలువపై ఉన్న వంతెన శిథిలమైంది. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు తక్షణం స్పందించి వంతెనలకు మరమ్మతులు జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.


గాల్లో వేలాడుతూ...!


కోటబొమ్మాళి: కన్నేవలస వద్ద రక్షణగోడలు లేని దృశ్యం

కోటబొమ్మాళి: మండలంలో వంశధార ప్రధాన కాలువపై కన్నేవలస, చుట్టిగుండం గ్రామాలకు వెళ్లే వంతెన గాల్లో వేలాడుతోంది. రక్షణగోడలు లేకపోవటంతో ఎప్పుడు?ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతూనే రాకపోకలు సాగిస్తున్నారు. గరీబులగెడ్డపై దంత, కొత్తపల్లి కూడలి, సరియాపల్లి వద్ద రోడ్లు, భవనాలశాఖ పరిధిలో వంతెనల రక్షణగోడలు కూలిపోయాయి. కోటబొమ్మాళి-సంతబొమ్మాళి రోడ్డులో సీతన్నపేట వద్ద, జర్జంగి- జలుమూరు రోడ్డులో వంశధార ప్రధాన కాలువపై వంతెన శిథిఫలస్థితిలో ఉన్నాయి. పాకివలస-జమచక్రం రోడ్డులోని పాకివలస వంతెన పరిస్థితి దారుణం. రక్షణగోడలు లేక ఓ గ్రానైట్‌ లారీ కాలువలోకి దూసుకుపోయింది. సమస్యలను ఉన్నతాధికారులకు తెలిపిినట్లు వంశధార, ర.భ.శాఖల అధికారులు స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని