ఆక్రమణ చెరలో మడ్డువలస భూములు
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

ఆక్రమణ చెరలో మడ్డువలస భూములు


మగ్గూరులో మడ్డువలస జలాశయానికి చెందిన కాలువ గట్లను ఆక్రమించుకొని సాగు చేస్తున్న అరటి, వరి పంట

వంగర, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధానమైనది మడ్డువలస. దీని ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 20 సంవత్సరాల కిందట దీని నిర్మాణానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని సుమారు 25 గ్రామాల నుంచి 7,450 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. సుమారు రూ.7 వేల ఎకరాల్లో ప్రాజెక్టును నిర్మించారు. మిగులు భూములు 450 ఎకరాలను వివిధ అవసరాలకు అధికారులు కేటాయించారు. ఈ భూములపై ప్రస్తుతం అక్రమార్కుల కన్నుపడింది. వీరికి స్థానిక నాయకుల అండదండలు తోడవడంతో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పక్కా కట్టడాలు నిర్మించేస్తున్నారు. కొంతమంది వివిధ పంటలు సాగు చేస్తున్నారు.

దర్జాగా పంటల సాగు: మగ్గూరు, మడ్డువలస, పటు వర్థనం, కొప్పర, వంగర, ఎం.సీతారాంపురం, కొట్టీశ, లక్ష్మీపేట తదితర గ్రామాల్లోని ప్రాజెక్ట్‌కు చెందిన మిగులు భూములను కొంతమంది రైతులు ఆక్రమించుకుని వరి, అరటి తదితర పంటలు పండించుకుంటున్నారు. వీరిలో కొంతమందికి ప్రాజెక్ట్‌ డీఈఈ గతంలో నోటీసులు అందించారు. అవి జారీ చేసి ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులకు ఆడింది ఆటా.. పాడింది పాటగా తయారైంది. ఒక్క మగ్గురు గ్రామంలోనే సుమారు 50, మడ్డువలస, వంగర, ఎం.సీతారాంపురం, లక్ష్మీపేట, కొట్టీశ, పట్టువర్థనం, తదితర గ్రామాల్లో సుమారు 250 ఎకరాల వరకు పలువురి గుప్పెట్లో ఉంది.

ఉన్నతాధికారులకు నివేదించాం: జలాశయం మిగులు భూముల ఆక్రమణ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. తహసీల్దారు, ఆర్డీవో దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలో భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. - నర్మదాపట్నాయక్‌, మడ్డువలస జలాశయం, డీఈఈ

కాలువ గట్లనూ వదల్లేదు..: అక్రమార్కులు మడ్డువలస ప్రాజెక్టు కాలువ గట్లనూ వదల్లేదు. కొద్దికొద్దిగా మట్టిని తవ్వేసి పక్కనున్న పొలాల్లో కలిపేసుకుంటున్నారు. గట్ల పైనే ఏకంగా అరటి తదితర తోటలు పెంచుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని