లేఅవుట్లలో ఆశించిన వసతులు ఏవి?
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

లేఅవుట్లలో ఆశించిన వసతులు ఏవి?


సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ‘భూమిపూజ చేయగానే ఇళ్లనిర్మాణం పూర్తయినట్లు కాదు.. దీనిపై చివరి వరకు పర్యవేక్షణ ఉండాలి’ అని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధ్యక్షతన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, గృహహక్కు, సచివాలయాల పనితీరుపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలివిడతగా 96,560 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వీటిల్లో 877 లేఅవుట్లలో ఆశించిన మేర మౌలిక వసతులు ఏవని ప్రశ్నించారు. తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్క ఇంటిని అక్టోబరు 31 నాటికి సర్వే పూర్తిచేసి డిసెంబరు 25లోగా రిజస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలపై ఒత్తిడి తీసుకురావొద్దని సూచించారు.

ఆందోళన చెందవద్దు: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అజయ్‌జైన్‌ స్పష్టం చేశారు. సెప్టెంబరు నెలలో ఏపీపీఎస్సీ ద్వారా సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నివేదికలు కోరామని, ప్రభుత్వానికి అందిన వెంటనే ప్రొబేషన్‌ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల సిబ్బంది హాజరు, పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో 20 రకాల సమస్యలను, వాటి కారణాలను జిల్లా అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జేసీలు సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములునాయుడు, టెక్కలి సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మత్‌, హౌసింగ్‌ పీడీ గణపతి, డ్వామా పీడీ కూర్మారావు, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని