ఆరుతడికే అగ్రతాంబూలం!
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

ఆరుతడికే అగ్రతాంబూలం!

 

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రబీలో అన్నదాతలు అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయశాఖ కార్యచరణను సిద్ధం చేసింది. ఆరుతడి పంటలకు ప్రాధాన్యమిస్తూ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రబీలో వరి విత్తనాలపై పూర్తిగా రాయితీని ఎత్తివేయాలని నిర్ణయించారు. అపరాలు, ఇతర పంటలు సాగుచేసేవారికి రాయితీ ప్రోత్సాహం అందించనున్నారు.

జిల్లాలో ఈసారి రబీలో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేసే విధంగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెసర, మినుము పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. 80 వేల హెక్టార్లలో ఈ రెండు పంటలు వేసేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను 4,500 క్వింటాళ్ల విత్తనాలను రైతుభరోసా కేంద్రాల ద్వారా రాయితీపై సరఫరా చేయనున్నారు. వీటితో పాటు వేరుశనగ సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచాలని చూస్తున్నారు. 10 వేల నుంచి 18 వేల ఎకరాల్లో సాగుకు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. అధిక దిగుబడులనిస్తున్న లేపాక్షి 1812 రకం విత్తనాలను, నువ్వు పంట విత్తనాలనూ అందుబాటులో ఉంచనున్నారు.

ప్రత్యేక ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు...

జాతీయ ఆహార భద్రతా మిషన్‌ ద్వారా అపరాల ప్రత్యేక ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వీటి ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు అందిస్తారు. జిల్లాలోని 38 మండలాల్లో 7,500 ఎకరాలకుగాను ఈ క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 140 ప్లాట్‌లుగా విభజించి, ఒక్కో ప్లాట్‌ 50 ఎకరాలు ఉండేలా చూస్తారు. ఒక హెక్టారుకు రూ.9,000 విలువైన విత్తనాల నుంచి పురుగుల మందుల వరకు అందజేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కూడా తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎంపికలు చేసేందుకు మూడు రోజుల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న 10 రోజుల్లో 7,500 ఎకరాల్లో ప్రదర్శనా క్షేత్రాల ఎంపిక పూర్తి చేసి ఆయా రైతులకు అవగాహన కల్పిస్తారు.

గ్రామసభల్లో అవగాహన కల్పిస్తాం

జిల్లాలో ఈ ఏడాది రబీలో రెండు లక్షల హెక్టార్లలో సాగు చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించాం. ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తున్నాం. అపరాల ప్రత్యేక ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులకు రెండింతల దిగుబడి వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఆరుతడి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్ఛు గ్రామసభల్లోనూ దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తాం.

- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని