రూ.6.50కోట్లు వృథాయేనా?
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

రూ.6.50కోట్లు వృథాయేనా?

పూర్తికాని మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు

 వాంబే కాలనీలో అసంపూర్తిగా ట్యాంకు నిర్మాణం

శ్రీకాకుళం నగరం వద్ద నాగావళి నదిలోనికి మురుగు చేరి నీరు కలుషితమవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి పొన్నాడ వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమృత్‌ పథకంలో భాగంగా 2016లో రూ.40 కోట్లతో రోజుకు 10ఎంఎల్‌డీ(కోటి లీటర్ల) మురుగునీటిని శుద్ధి చేసేలా కేంద్రం పనులు మంజూరు చేసింది. ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా చేపట్టే ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం 40, రాష్ట్రం 20, నగరపాలకసంస్థ 40 శాతాల చొప్పున నిధులు కేటాయించేలా నిర్ణయించారు. ఆ మేరకు గుత్తేదారు పనులు ప్రారంభించారు. అవి నేటికీ పూర్తికాలేదు.

-న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

తొలుత కలెక్టరేట్‌ సమీపంలో వాంబేకాలనీ వద్ద మురుగునీటి నిల్వ ట్యాంకు, పొన్నాడ వద్ద కేంద్ర నిర్మాణం మొదలుపెట్టారు. సుమారు రూ.6.50 కోట్ల మేర పనులు జరిగాయి. ఆ మేరకు గుత్తేదారునికి ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లింపులు జరిగిపోయాయి. మిగిలిన పనులు చేసేందుకు గుత్తేదారు సుముఖత వ్యక్తం చేయట్లేదు. గతంలో చేపట్టిన కొన్ని పనులకు సంబంధించి కేంద్రం పూర్తిస్థాయిలో విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవటం, కొంతమేర చెల్లించినా తీవ్ర జాప్యం వంటి పలు కారణాలతో గుత్తేదారు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సామగ్రిని, సిబ్బందిని కూడా ఏడాది కిందటే ఇక్కడి నుంచి తరలించేశారు. ప్రభుత్వం చొరవతీసుకుని పనుల పూర్తికి ముందుకు రాకుంటే ఇప్పటి వరకు వెచ్చించిన ప్రజాధనం నిరుపయోగమయ్యే అవకాశం ఉంది.

గడువు ముగిసినా కలగని మోక్షం...

మొదట విడతలో మంజూరైన పనుల పూర్తికి గడువు రెండేళ్ల కిందట పూర్తయింది. ప్రస్తుతం రెండో విడత సైతం అమలవుతోంది. కానీ ఇప్పటికీ జిల్లాలో మొదటి విడతలో ప్రారంభమైన నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం మాత్రం కొలిక్కిరాలేదు. ఫలితంగా ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడటంతో పాటు పనులు జరుగుతున్న ప్రాంతంలో స్థానికులు అవస్థలు తప్పడం లేదు.

నిరాశే మిగులుతోంది...

నగరంలోని ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా నదిలో కలిసి జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో నదిలో ఉన్న నగరానికి చెందిన తాగునీటి ఊటబావులతో పాటు ఎచ్చెర్ల, శ్రీకాకుళం గ్రామీణ మండలాల పరిధిలోని పలు మంచినీటి పథకాల ఊటబావుల్లోకి ఆ మురుగునీరు చేరుతోంది. వేసవిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కేంద్రం పనులు పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందనుకున్నవారందరికీ నిరాశే మిగులుతోంది.

అటకెక్కిన రెండో విడత ప్రతిపాదనలు

మొదటి విడతగా పొన్నాడ వద్ద పనులు పూర్తయితే రెండో విడతలో నదికి ఆవలివైపు గుజరాతీపేటలో మరో కేంద్రం నిర్మించేందుకు అధికారులు అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గుజరాతీపేట, పీఎన్‌కాలనీ, బైరివానిపేట, ముచ్చవానిపేట, ఫాజుల్‌బేగ్‌పేట, నాయుడుచెరువుగట్టు, సీపన్నాయుడుపేట, తదితర ప్రాంతాలకు చెందిన మురుగునీటిని శుద్ధి చేయాలని నిర్ణయించారు. మొదట విడత పనులకే అతీగతి లేకపోవడంతో ఈ రెండోవిడత ప్రతిపాదనల విషయాన్నే అధికారులు పూర్తిగా మర్చిపోయారు.

చర్యలు తీసుకుంటాం...

మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు చేపట్టనందుకు సంబంధిత గుత్తేదారునికి నోటీసులు జారీ చేస్తాం. సాధ్యమైనంత త్వరలో మళ్లీ పనులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటాం.

- పి.సుగుణాకరరావు, ప్రజారోగ్యశాఖ ఈఈ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని