భర్తే కడతేర్చాడు..!
eenadu telugu news
Published : 28/10/2021 04:18 IST

భర్తే కడతేర్చాడు..!


పైడమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రావణి, తదితరులు

వీరఘట్టం, న్యూస్‌టుడే: వీరఘట్టం మండలంలోని కంబరవలసలో మంగళవారం బేపల పైడమ్మ (51) అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. దీనిపై డీఎస్పీ ఎం.శ్రావణి మాట్లాడుతూ పైడమ్మను తన భర్త బి.గౌరు హతమార్చాడని, కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగిందని తెలిపారు. తన భార్య గుండెపోటుతో మరణించిందని హంతకుడు తెలిపాడన్నారు. మృతదేహం చెవులు, ముక్కు వద్ద రక్తం గడ్డ కట్టి ఉందని, ఈ ఆధారాల మేరకు ప్రాథమికంగా నిర్ధారించిన అనంతరం హత్యగా కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించామని, నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, నెల రోజుల నుంచి పైడమ్మ భర్తతో వేరుపడి ఆదే వీధిలో మరో ఇంట్లో నివాసముంటోందని స్థానికులు తెలిపారు. మంగళవారం ఆమెను ఇంటికి తీసుకొచ్చిన గౌరు రాత్రి సమయంలో మృతిచెందినట్లు తెలిపాడన్నారు. ఈ సమాచారం విశాఖలో ఉంటున్న కుటుంబసభ్యులకు తెలియజేశామని, వారు కంబరవలస చేరుకొని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.


పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

పాతపట్నం, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం మండలం కాగువాడ గ్రామానికి చెందిన భగీరథ పొల్లాయ్‌ (65) మంగళవారం మద్యం తాగేందుకు డబ్బులివ్వమని భార్య శకుంతలను అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై సమీపంలో ఉన్న మహేంద్రతనయ నది ఒడ్డున పురుగుల మందు తాగాడు. స్థానికులు గుర్తించి పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎ.ఎస్‌.ఐ. సింహాచలం తెలిపారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

సురేష్‌ (దాచిన చిత్రం)

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: సరుబుజ్జిలి మండలంలోని షళంత్రి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ కొల్ల సురేష్‌ (37) బుధవారం మృతి చెందారు. ప్రస్తుతం హైదరాబాదులోని చంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్‌ క్యాంపులో పని చేస్తున్నారు. 10 రోజులుగా సురేష్‌ జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. సురేష్‌కు భార్య, తల్లి ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని