Published : 08/04/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యజమానులతో కుమ్మక్కు నిజమా?!

భవనాలకు మళ్లీ కొలతలు వేయాలని నిర్ణయం

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని భవనాలకు మళ్లీ కొలతలు వేయనున్నారు. కొందరు రెవెన్యూ సిబ్బంది భవన యజమానులతో కుమ్మక్కై తక్కువ ఆస్తి పన్ను విధిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో భవనాలకు మళ్లీ కొలతలు వేయాలని కమిషనర్‌ సృజన నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపించారు. ఎన్నికలకు ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా వాయిదా పడింది. పాలకవర్గం కొలువుదీరడంతో త్వరలో ఈ ప్రక్రియ పట్టాలెక్కనుంది.●

రెవెన్యూ పనితీరుకు నిదర్శనాలు...●

* ఏడాదిన్నర క్రితం ఆస్తి పన్ను తక్కువ విధించారని, తిరిగి మదిస్తే రెండింతలు చెల్లించాల్సి ఉంటుందని జోన్‌-3 సిబ్బంది కొందరు ఓ భవన యజమానిని బెదిరించారు.. ఆస్తి పన్ను మదించకుండా ఉండటానికి రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరికి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

* నగరంలోని రామాటాకీస్‌ ప్రాంతంలోని ఒక దుకాణానికి రూ.7,600 ఆస్తి పన్ను విధించారు. అయితే ఉన్నతాధికారులకు సందేహం వచ్చి మళ్లీ ఆ భవనానికి మరోసారి కొలతలు తీయగా పన్ను రూ.10,650కి పెరిగింది. సరిగా కొలతలు వేయకుండా, భవన యజమానితో సిబ్బంది కుమ్మక్కైనట్లుగా తేలింది.

* ఎంవీపీకాలనీలో ఓ భవనానికి నివాస సముదాయం కింద రూ.1240 ఆస్తి పన్ను విధించారు. ఆరేళ్ల తరువాత అది నివాసం కాదని, వాణిజ్య వినియోగ భవనమని గుర్తించి పన్ను విధించడం గమనార్హం.

* రామ్‌నగర్‌లో 1990లో నిర్మించిన ఇంటికి రూ.240 ఆస్తి పన్ను వేశారు. 2002లో అదే స్థలంలో జి ప్లస్‌3 భవనాన్ని నిర్మించారు. 2019లో ఆ భవనానికి ఆస్తి పన్ను మదింపు చేసి రూ.1890 విధించారు. జి ప్లస్‌3 నిర్మాణం చేసినట్లు తెలిసినా, రెవెన్యూ సిబ్బంది ఆస్తి పన్ను మదింపులో జాప్యం చేశారా లేక యజమానితో కుమ్మక్కై పదిహేడేళ్లు విడిచిపెట్టారా అనే అంశంపై ఉన్నతాధికారులు ఎటూ తేల్చలేదు.

* ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత పన్ను విధించాలని భవనాల యజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగినా రెవెన్యూ సిబ్బంది ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మధురవాడ, కొమ్మాది, గాజువాక, మల్కాపురం, పెందుర్తి ప్రాంతాలలో తాజాగా నిర్మించిన పలు అపార్టుమెంట్లకు ఇప్పటికీ పన్నులు వేయకపోవడం దీనికి నిదర్శనమని పలువురు వాపోతున్నారు.


నష్టపోతున్న జీవీఎంసీ

నగరంలో 5,21,931 అసెస్‌మెంట్లున్నాయి. వాటి ద్వారా 345.67కోట్ల ఆదాయం లభిస్తోంది. నివాస, వాణిజ్య భవనాల మధ్య పన్ను విధింపులో తేడాలుంటాయి. అనధికారిక నిర్మాణాలకు 100శాతం అదనపు పన్ను విధించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఆస్తి పన్ను విధించిన తరువాత నివాస భవనాలను వాణిజ్య పరంగా వినియోగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఈ విషయాలు తెలిసినా కొందరు భవన యజమానులతో కుమ్మక్కవుతూ జీవీఎంసీకి నష్టం కలిగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోసారి కొలతలు వేస్తే ప్రస్తుతం జీవీఎంసీకి వస్తున్న ఆదాయం 20శాతం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


పన్ను మదింపులో లోపాలను సరిదిద్దుతాం...

ప్రస్తుతం ఆస్తి పన్ను విధింపులో లోపాలను వెలికితీయడానికి నగరంలోని భవనాలకు తిరిగి కొలతలు వేయాలని నిర్ణయించాం. ఎన్నికల ముందే ప్రక్రియ ప్రారంభించాలనుకున్నాం. అనివార్య కారణాల వల్ల ఆగింది. త్వరలో ఈ ప్రక్రియను పట్టాలెక్కిస్తాం. ఉద్దేశపూర్వకంగా పన్ను విధింపులో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తప్పవు. వార్డు కార్యదర్శుల సహకారంతో అన్ని భవనాల కొలతలు తీయిస్తాం.. ప్రతి జోన్‌లో 10శాతం భవనాలను థర్డ్‌ పార్టీ ద్వారా పరిశీలన చేయిస్తాం.

- డాక్టర్‌ జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని