Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాగ్రత్తలు పాటిద్దాం.. వేసవిని దాటేద్దాం

నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

ఏడాది మార్చి నుంచే భానుడు భగభగమంటూ ప్రతాపం చూపుతున్నాడు. గత ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో వేసవి అంతా ఇంటికే పరిమితమయ్యాం. ఈ ఏడాది రెండో దశ కరోనా కేసులు నమోదవుతున్నా.. ఇంటిపట్టునే ఉండే పరిస్థితులు లేవు. కొవిడ్‌ బారిన పడకుండా మాస్కులు ఎలా ధరిస్తున్నామో.. ఎండ ప్రభావం మనపై పడకుండా జాగ్రత్తలు పాటిస్తే.. ఈ వేసవిని ఇట్టే దాటేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మార్చి నుంచే భగభగ

‘ఏప్రిల్‌, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మార్చి 31న 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో మార్చిలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కాలేద’ని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియరు శాస్త్రవేత్త ఎంబీజీఎస్‌ కుమారి పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 21న 37.4 డిగ్రీలతో ఎండ వేడిమి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 31వ తేదీకి 39.3 డిగ్రీలకు చేరుకుంది. వేసవిలో ఇళ్లలో ఉన్నా.. బయటకు వెళ్లినా.. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మన్యంలోనూ ఉక్కపోత

జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మైదాన, గిరిజన ప్రాంతాల కలబోతగా ఉన్న జిల్లాలో వేసవిలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. ఇది వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో వేసవి తాపం తక్కువగా ఉండేది. ఇప్పుడు అక్కడా.. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. ఉక్కపోత, వడగాలులతో గిరిజనులూ అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి, పాయరావుపేట ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. చాలా మంది మండుటెండలోనే కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. వీధి వ్యాపారులూ ఎండలోనే విక్రయాలు చేస్తుంటారు. అనకాపల్లిలోని ప్రధాన రహదారిలో గొడుగు నీడలో చిరు వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. ఇలాంటి వారు వేసవి తాపంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

పచ్చని చెట్లు.. భూగర్భ జలాలు

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిది. ఒకపక్క పెరుగుతున్న కరోనా కేసులు.. మరోపక్క అధికవుతున్న ఉష్ణోగ్రతలతో అప్రమత్తంగా ఉండాలి. ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్‌ పోలీసులకు అనకాపల్లిలో స్వచ్చంద సంస్థ సభ్యులు కళ్లద్దాలు, టోపీలు గతంలో పంపిణీ చేశారు. జీవీఎంసీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పచ్చని చెట్లు, భూగర్భ జలాల పెంపుపై పెద్దగా దృష్టిసారించడం లేదు. చుట్టూ చెట్లు ఉన్న ప్రాంతంలో మండు వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. పట్టణీకరణ పేరుతో పెద్ద పెద్ద చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నామే తప్ప.. పచ్చదనం పెంపునకు చేపడుతున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయి. భూగర్భ జలాల వృద్ధి చర్యలు శూన్యమే. నీటి వృథాగా అరికట్టడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ముఖ్యం. ఇలా చేయకపోవడం వల్లే వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

2016లో మినహా..
గతంలో ఎప్పుడూ మార్చిలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఏప్రిల్‌లో ఎండ తీవ్రత ఉన్నా.. రాబోయే ఐదు రోజుల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్‌ మూడో వారం, మే నెలతోపాటు జూన్‌ రెండో వారం వరకు వేడి వాతావరణం కొనసాగుతుంది. ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. పంటలు తెగుళ్ల బారినపడే ప్రమాదం ఉంది. రైతులు శాస్త్రవేత్తల సూచనలతో పంటలను కాపాడుకోవాలి. 2019 జూన్‌ 16న 44.6 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2016 నుంచి గత ఏడాది మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో 40 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- డ్రాక్టర్‌ ఎంబీజీఎస్‌ కుమారి, సీనియర్‌ శాస్త్రవేత్త, అనకాపల్లి

ప్రయాణ సమయంలో తాగునీరు ఉంచుకోండి
వేసవిలో ప్రయాణాలు చేసే వారంతా తప్పనిసరిగా తాగునీటిని తీసుకువెళ్లాలి. ఇళ్లలో ఉండే వారూ ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకోవాలి. వడదెబ్బ బారిన పడితే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తీసుకోవాలి. వేసవిలో మితాహారం తీసుకోవడం, ఉదయం, సాయంత్రం వేళలో వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

- డాక్టర్‌ జి.కృష్ణ, జనరల్‌ ఫిజీషియన్‌, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి, అనకాపల్లి

పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి..
వేసవిలో పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలి. మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు పంపవద్దు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో చెరువులు, బావుల్లో ఈతకొట్టేందుకు పిల్లలు వెళ్తుంటారు. మిట్ట మధ్యాహ్న సమయంలో ఇలా చేయడం వల్ల వడదెబ్బ బారినపడే ప్రమాదముంది. ఆరునెలల్లోపు పిల్లలకు తల్లి పాలు తరచూ ఇస్తూ ఉండాలి. ఆరునెలల దాటిన పిల్లలతో తరచూ నీరు తాగించాలి. కొబ్బరి నీళ్లు, బార్లీ, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీటిని తరచూ తాగిస్తుంటే అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి పిల్లలను కాపాడవచ్చు.

- డాక్టర్‌ ప్రవీణ్‌వర్మ, చిన్నపిల్లల వైద్యునిపుణులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని