Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎరువు.. బరువు

ధరలు పెరిగితే అన్నదాతలపై రూ.పది కోట్ల వరకు భారం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, అనకాపల్లి

2018 ఏప్రిల్‌లో డీఏపీ ధర రూ.1,076 ఉంటే అదే ఏడాది అక్టోబరులో రూ.1,200కి పెంచారు. ఇప్పుడు ఏకంగా రూ.1,700 నుంచి రూ.1,900కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. ఎంఓపీ 2018 ఏప్రిల్‌లో రూ.614 ఉంటే అదే ఏడాది రూ.875 చేశారు. ఇప్పుడు రూ.1,000 వరకు పెంచే అవకాశముంది. 28-28, 14-35-14, 19-19-19 ధరలు రూ1,350 నుంచి రూ.1,700కు పెంచనుండటంతో ఇకపై ఎరువు మాట వినడానికే రైతు భయపడే పరిస్థితి.

ఎరువులు రైతులకు భారం కానున్నాయా అంటే.. వ్యవసాయ అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఎరువుల ముడి సరకులు ప్రియం కావడంతో ధరలు పెంచాలంటూ కర్మాగారాల ప్రతినిధులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. లేదు.. పాత ధరలకే విక్రయిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ప్రకటించి మళ్లీ మాట మార్చింది. పాత ధరలు ఇప్పటి వరకు ఉన్న నిల్వల విక్రయాలు అయ్యే వరకే పరిమితమని పేర్కొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగితే.. జిల్లాలో రైతులపై సుమారు రూ.పది కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. ఆయా కంపెనీలు ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే ఎరువుల డీలర్లకు సమాచారం ఇచ్చాయి. యూరియాకు ఇంకా ఏ సమాచారం లేదని డీలర్లు చెబుతున్నారు. అసలే వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని లబోదిబోమంటున్న రైతులను పెరగనున్న ఎరువుల ధరలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్టుబడి ఖర్చులు భరించలేక రైతులు ఎరువుల వినియోగంలో కోత పెడుతుండటంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో డీఏపీ, ఎంఓపీ ఎరువుల వినియోగం అనుకున్న స్థాయిలో లేదు. ఇప్పుడు ధరలు పెరిగితే వినియోగం మరింత పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.

ఖరీఫ్‌లో 47,699 టన్నుల వినియోగం

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 1.75 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాఇయ. వీటికి 47,699 టన్నుల ఎరువులు వేస్తున్నారు. ధర తక్కువని యూరియానే 28,383 టన్నులు ఉపయోగిస్తున్నారు. డీఏపీ, ఎంఓపీ ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు కలిపి 19,316 టన్నుల వరకు వినియోగం ఉంటోంది. డీఏపీ బస్తాకు రూ.600, ఎంఓపీ రూ.120, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు రూ.350 వరకు ధర పెరిగే అవకాశముందని డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో అన్నదాతలు ప్రస్తుతం ఎరువుల కోసం చేస్తున్న వ్యయానికి అదనంగా రూ.10 కోట్లకుపైగా చేయాల్సి వస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంచనా వేస్తున్నారు.

అవసరం ఎక్కువ.. వినియోగం తక్కువ
ఏ పంటకైనా సమతుల్యంగా ఎరువులు వేస్తేనే ఆశించిన దిగుబడులు వస్తాయి. రైతులు మాత్రం నత్రజని అందించే యూరియా అధిక మోతాదులో వాడుతూ డీఏపీ, ఎంఓపీ వంటి కాంప్లెక్స్‌ ఎరువులను బాగా తక్కువగా వేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో చెరకు తోటకు డీఏపీ 87 కేజీలు వేయాల్సి ఉంటే 22 కేజీలే వేస్తున్నారు. ఎంఓపీ 83 కేజీలకు 44 కేజీలు వాడుతున్నారు. యూరియా 96 కేజీలు వేయాల్సి ఉండగా 200 కేజీలు వాడుతున్నారు. కారణం యూరియా ధర తక్కువగా ఉండటమే. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఇప్పటికే అధికంగా ఉన్నాయనుకుంటే తాజాగా ధరలు పెరిగితే రైతులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది.
ఇంకా పెరగలేదు
ఎరువుల ధరలు పెరుగుతాయన్న సమాచారమే తప్ప అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం పాత ధరలతోనే విక్రయిస్తున్నారు. ధర పెంచి ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
- లీలావతి, జేడీ, వ్యవసాయశాఖ

చక్కెర కర్మాగారాలపైనా..
చోడవరం, న్యూస్‌టుడే:  ఎరువుల ధరలు పెరిగితే చక్కెర కర్మాగారాలపై ఆర్థికంగా మరింత భారం పడనుంది. ఏటా సీజన్‌లో గోవాడ చక్కెర కర్మాగారం చెరకు రైతులకు వడ్డీలేని రుణ ప్రతిపాదికపై ఎరువులు అందజేస్తోంది. ఎకరాకు మూడు యూరియా బస్తాలు, రెండు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, పొటాష్‌ బస్తా ఒకటి ఇస్తోంది. వీటిలో పొటాష్‌ ధర బస్తాకు మార్కెట్‌ కంటే రూ.300 వరకు పెరిగింది. 200 టన్నుల వరకు పొటాష్‌ సరఫరా చేస్తే.. రూ.పది లక్షల మేర అదనపు భారం పడే అవకాశముంది. చెరకు సాగుకు ఇటీవల వరకు డీఏపీ అందజేసేవారు. మార్కెట్లో ధర అధికంగా ఉండటంతో డీఏపీ సరఫరాకు స్వస్తి చెప్పారు.

దిగుబడులు తగ్గుతాయి

- ప్రదీప్‌, శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం
సరిపడినంత కాంప్లెక్స్‌ ఎరువులు వేయకపోవడం వల్ల చెరకు దిగుబడులు హెక్టారుకు ఏడు టన్నుల వరకు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. రాష్ట్రంలో హెక్టారుకు సరాసరి దిగుబడులు 72 టన్నులుంటే, ఇక్కడ 55 టన్నులే ఉంది. దీనికి ప్రధాన కారణం అధిక శాతం వర్షాధారంగా సాగు చేయడం, కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం తక్కువగా ఉండటమే. పొటాష్‌ వేయకపోతే పంచదార అధిక శాతం ఆకుల్లోనే ఉండిపోతుంది. ఫలితంగా పంచదార, బెల్లం దిగుబడులు తగ్గుతాయి. చెరకు పంటకే కాదు.. అన్ని పంటల్లోనూ ఇటువంటి పరిస్థితే ఉంటోంది.

సేద్యానికి దూరమవ్వడమే

- ఇల్ల అప్పారావు, రైతు, కాకరాపల్లి
ఆరు ఎకరాల పొలం ఉంది. మూడు ఎకరాల్లో సరుగుడు వేశా. వాటి ధరలు పడిపోయాయి. గత ఏడాది చెరకు తోట మూడు ఎకరాల్లో వేస్తే రూ.18 వేల నష్టం వచ్చింది. రెండు ఎకరాల్లో వరి సాగుచేస్తే రూ.పది వేల నష్టం వచ్చింది. పంటలకు ధరలు రావడం లేదు. వాటికి ఉపయోగించే ఎరువుల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సాగు చేయలేం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని