Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ కేసుల ఉద్ధృతి

విశాఖపట్నం, న్యూస్‌టుడే

కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాకులో బాధితులతో ఐసీయూ వార్డు

నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు బాధితులు పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో చేరే సంఖ్య రెట్టింపవుతోంది. వీటి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌, సాధారణ పడకల సంఖ్యను యంత్రాంగం పెంచుతోంది. కేజీహెచ్‌లో ఇప్పటికే 500 పడకలు సిద్ధంగా ఉండగా, వాటిలో 300 పడకల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో చికిత్స కోసం కొవిడ్‌ వార్డుకు తరలివస్తుండడంతో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు నిండిపోతున్నాయి.
బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో నగరంతో పాటు జిల్లాలో ఉన్న ఇతర ప్రభుత్వ ఆసుపత్రులను యంత్రాంగం సిద్ధం చేస్తోంది. టీబీ ఆసుపత్రిలోనూ బాధితులను చేర్చుకుంటున్నారు. ఇక్కడ 288 పడకలు అందుబాటులో ఉండగా ఇప్పటికే పదిమంది చేరారు. విమ్స్‌లో 300 పడకలను సిద్ధం చేశారు. ఆయా పడకల నిర్వహణకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సమీకరణపై అధికారులు దృష్టి సారించారు.
అనకాపల్లి, పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో వంద చొప్పున 200 పడకలను సిద్ధం చేశారు. అరకు, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రుల్లో 135 పడకలను సిద్ధం చేశామని కొవిడ్‌ ప్రత్యేక అధికారి, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. బాధితులు, కేసుల సంఖ్య పెరుగుతున్నందున తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఔషధాలు, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి సిద్ధం చేయాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

నిరుపయోగంగా పీపీఈ కిట్లు
లక్ష్మీదేవిపేట(అనకాపల్లి): స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పీపీటీ కిట్లు నిరుపయోగంగా ఉన్నాయి. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది కరోనా బారిన పడకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా కిట్లు పంపించింది. వీటిని వాడకుండా కార్యాలయం మేడపై గుట్టగుట్టలుగా పడేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వీటిని నిరుపయోగంగా పడేయడంపై పలువురు విమర్శిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని