Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి పట్టివేత

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: కారులో తరలిస్తున్న 70 కేజీల గంజాయిని నర్సీపట్నం గ్రామీణ పోలీసులు ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కేఎల్‌పురం శివారు నగరం సమీపాన రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు కారులో గంజాయి పట్టుబడింది.  జి.మాడుగుల మండలం పెదరాయికి చెందిన కిముడు కృపానంద్‌ అనే యువకుడుని అరెస్టు చేసినట్టు వివరించారు. విశాఖ ఏజెన్సీ నుంచి విశాఖపట్నానికి ఈ గంజాయిని అడ్డదారిలో తరలించేందుకు ప్రయత్నిస్తూ తమకు నిందితుడు పట్టుబడ్డాడని, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సివుందని వివరించారు.
వెంకటాచలం, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా నుంచి చెన్నైకు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద అధికారులు ఆదివారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు తమిళనాడుకు చెందిన మురుగన్‌ అనేవ్యక్తి విశాఖ జిల్లా మద్యగరువు అటవీ ప్రాంతంలో 19 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దానిని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో విశాఖ నుంచి తిరుపతికి తరలిస్తుండగా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీం, వెంకటాచలం హౌసింగ్‌ ఏఈ సీహెచ్‌.వెంకటేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. బస్సులో ఉన్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అదుపులోకి తీసుకొని వెంకటాచలం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులో ముగ్గురి అరెస్టు
బెంగళూరు: విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని  అరెస్టు చేశామని డీసీపీ జోషి శ్రీనాథ్‌ మహదేవ్‌ వెల్లడించారు. వీరి నుంచి రూ.32 లక్షల విలువైన 106 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రామనగర వాసి రవికుమార్‌, కొళ్లేగాల నివాసి మారప్ప అలియాస్‌ కుళ్ల దిలీప్‌, ఒడిశాలోని కటక్‌కు చెందిన రాజకిశోర్‌ నాయక్‌లను నిందితులుగా గుర్తించారు. అరకులోయలో సంతోష్‌ అనే వ్యక్తి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి బెంగళూరులో  ఎక్కువ ధరకు విక్రయించుకుంటూ పోలీసులకు వీరు చిక్కారని చెప్పారు. అతన్ని అరెస్టు చేసేందుకు ఒక బృందం ఇప్పటికే అరకు వెళ్లినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని