Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆసుపత్రుల్లో సీఐడీ తనిఖీలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: గ్రామీణ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన పరికరాలపై సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరికరాల కోనుగోలులో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. విశాఖ జిల్లాలోని ఆసుపత్రుల్లో కూడా తనిఖీలు చేస్తారని ,సెలవు రోజుల్లో కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యవిధాన పరిషత్‌ సమన్వయకర్త డాక్టర్‌ లక్ష్మణరావు నుంచి ఆసుపత్రులను ఆదేశాలు వెలువడినట్లు అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి సూపరిండెంటు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరుతో పాటు ఇతర ఆసుపత్రుల్లోను పరికరాల కొనుగోలుపై సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.
·కేజీహెచ్‌లో రెండోరోజూ విచారణ
కేజీహెచ్‌లో వైద్య పరికరాల నిర్వహణకు సంబంధించి వరసగా రెండో రోజు ఆదివారం సీఐడీ అధికారులు విచారణ కొనసాగించారు. ఏఒక్క వైద్య పరికరాన్ని విడవకుండా విచారణ కొనసాగుతోంది. గతంలో టీబీఎస్‌ సంస్థ వైద్య పరికరాల నిర్వహణ చేపట్టిన సమయంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అనిశా చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగా ప్రస్తుతం సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి మరో విడత విచారణ చేపట్టారు. దీంతో ఆసుపత్రి వర్గాల్లో తాజా విచారణ గుబులు రేపుతోంది. పరికరాల విలువ కంటే నిర్వహణ ఖర్చులు అధికంగా కోడ్‌ చేసి అప్పట్లో గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం మేలు చేసిందని ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై గత రెండు రోజులుగా సీఐడీ బృందాలు కేజీహెచ్‌లో ముమ్మరంగా పరికరాల నిర్వహణపై విచారణ సాగిస్తున్నాయి. తేలిక పాటి పరికరం నుంచి ఎంఆర్‌ఐ స్కానర్‌ వరకు ఏదీ వదలడం లేదు. కేజీహెచ్‌ దస్త్రాల్లో నిక్షిప్తమైన సమాచారంతో ప్రస్తుత పరికరాల వివరాలను సరిపోల్చడం, వాటి వార్షిక నిర్వహణ వివరాలపై ఆరా తీస్తున్నారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 8మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది విచారణలో పాలుపంచుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని