Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊరూరా జాతర.. ఇంటింటా పండగ

అనకాపల్లి/గ్రామీణం, కొత్తూరు(అనకాపల్లి), కశింకోట: కొత్త అమావాస్య సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నూకాలమ్మ జాతరలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి   నూకాలమ్మ ఆలయా నికి  జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.   శంకరం, రేబాక, అక్కిరెడ్డిపాలెం, చింతనిప్పుల అగ్రహారం, మారేడిపూడి, కోడూరు, గొలగాం, సత్యనారాయణపురం, వెంకుపాలెం గ్రామాల్లో నూకాంబికా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పురవీధుల్లో అమ్మవారి ఘటాలను మేళతాళాలతో ఊరేగించారు. కశింకోట శ్రీనూకాంబికా అమ్మవారి దేవాలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని అనకాపల్లి ఎంపీ డా.భీశెట్టి సత్యవతి దర్శించుకొని పూజలు చేశారు. కశింకోట వెలంపేటకు చెందిన గుత్తేదారు వీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, సుబ్బలక్ష్మిదేవి దంపతులు అమ్మవారికి రూ.లక్ష విలువ చేసే కిలో వెండి వడ్డాణం బహూకరించారు.

ఎలమంచిలి గ్రామీణం, రాంబిల్లి, మునగపాక: జంపపాలెం, కొక్కిరాపల్లి, పద్మనాభరాజుపేట, తురంగలపాలెం గ్రామాల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించారు.  కొప్పుగొండుపాలెం, వెల్చూరు, రాజకోడూరు, దిమిలి గ్రామాల్లో అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కొత్తూరు, మురకాడ, మర్రిపాలెం, కొత్తపట్నం, అప్పారాయుడుపాలెం, మూలజంప, కట్టుబోలు, పంచదార్ల గ్రామాల్లోని ఆలయాల వద్ద అన్నసమారాధనలు ఏర్పాటుచేశారు. రాజకోడూరులో ఎడ్లబళ్ల పోటీలు నిర్వహించారు. మునగపాకలో నూకాంబికా అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.  
నర్సీపట్నం అర్బన్‌, మాకవరపాలెం, నాతవరం: నర్సీపట్నంలో నూకాంబికా అమ్మవారి పెద్దజాగారం మొదలైంది. ఎమ్మెల్యే గణేష్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. పురపాలిక వైస్‌ఛైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, మాజీ వైస్‌ఛైర్మన్‌ సన్యాసిపాత్రుడు, పలువురు కౌన్సిలర్లు  పాల్గొన్నారు. మాకవరపాలెం ఆలయంలో అమ్మవారిని పూలతో అలంకరించారు.

పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, నక్కపల్లి: పాయకరావుపేటలో నూకాలమ్మతల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోటవురట్ల, కైలాసపట్నం, కె.వెంకటాపురం, పి.కొత్తపల్లి, బోడపాలెం, ఎస్‌.రాయవరం, తిమ్మాపురం, గోకులపాడు, గెడ్డపాలెం, కోనవానిపాలెం, నక్కపల్లి, వేంపాడు, పెదతీనార్ల తదితర గ్రామాల్లో నూకాలమ్మతల్లి గరగలను ఊరేగించారు. కోనవానిపాలెంలో చిన్నారుల కోలాటం అలరించింది. వేంపాడు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కోటవురట్ల ఎస్సై సురేష్‌ కైలాసపట్నం, కోటవురట్ల గ్రామాల్లో  దేవాలయాలను సందర్శించి భక్తులకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు.  
దేవరాపల్లి, కె.కోటపాడు, మాడుగుల/గ్రామీణం: ఎ.కొత్తపల్లిలో నూకాంబికా అమ్మవారిని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, సర్పంచి చింతల సత్య వెంకటరమణ దర్శించుకున్నారు.   భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఎం.అలమండలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎడ్లబళ్ల పోటీల్లో విజేతలకు విప్‌ బూడి ముత్యాలనాయుడు, సర్పంచి దాడి జగన్‌ బహుమతులు అందించారు. గొండుపాలెం, కె.కోటపాడు, చౌడువాడ గ్రామాల్లోని నూకాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. చౌడువాడలో అమ్మవారి ఘటాలు, గుర్రాల ఊరేగింపు ఆకట్టుకుంది. మాడుగులలో నూకాలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్పంచి యడ్ల కళావతి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఒమ్మలి నూకాలమ్మ ఆలయం వద్ద ముగ్గుల, పిడతల పోటీలు నిర్వహించారు.  అప్పలరాజుపురంలో జిల్లాస్థాయి ఎడ్లబళ్ల పరుగుల పోటీలను నిర్వహించారు.

చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట: గౌరీపట్నం, తిమ్మన్నపాలెం, గోవాడ, చోడవరం, బెన్నవోలు గ్రామాల్లో అమ్మవారి జాతర సంప్రదాయబద్ధంగా జరిగింది.   కె.పి.అగ్రహారంలో అమ్మవారిని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దర్శించుకున్నారు. ఇక్కడ జిల్లాస్థాయి ఎడ్ల బళ్ల పోటీలు నిర్వహించారు. కొత్తకోట, మత్స్యపురం, మేడివాడ గ్రామాల్లోని ఆలయాల వద్ద మహిళలు బారులుదీరారు. రోలుగుంటలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఎలమంచిలి, న్యూస్‌టుడే: నూకాంబికా అమ్మవారి ఆలయం వద్ద వేపచెట్టుకు మహిళలు పూజలు చేశారు.
సీలేరు, గూడెంకొత్తవీధి,జి.మాడుగుల, అనంతగిరి:    ధారాలమ్మ అమ్మవారి   జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ శాంతి అమ్మవారికి సారె సమర్పించారు. ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సాంబశివరావు, కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. ఆర్వీనగర్‌ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. అనంతగిరి వీధుల్లో ఘటాలను ఊరేగించారు జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగరువులో రాచకొండమ్మ తల్లి జాతరను నిర్వహించారు.  
చింతపల్లి గ్రామీణం: సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆధ్మాతిక సభలో ఆమెమాట్లాడారు. సర్పంచి పుష్పలత పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని