Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీనం.. దిగుబడులు ఘనం

మూడు రోజుల్లో ముగియనున్న ప్రస్తుత సీజన్‌
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

తూర్పు తీరానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ చేపలరేవు ప్రస్తుత సీజన్‌లో రూ.2651కోట్ల విలువచేసే మత్స్య దిగుబడులు సాధించింది. రొయ్యల దిగుబడులు లక్ష్యాన్ని దాటాయి.  గత ఏడాది జూన్‌ 15న మొదలైన 2020-21 సీజన్‌ ఈనెల 15వ తేదీతో ముగియనున్నది. 2019-20తో పోల్చితే గణనీయంగా దిగుబడులు పెరిగాయి.
ఎగుమతులెక్కడికి?: విశాఖ నుంచి మత్స్యరాశులు అమెరికా, జపాన్‌, వంటి దేశాలకు ఎగుమతి అవుతాయి. మన దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లకు రొయ్యలు పెద్దఎత్తున వెళుతున్నాయి. చేపలు, ఎండు చేపలు వంటివి అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ్‌బంగ రాష్ట్రంలోని పలు నగరాలకు ఎగుమతి అవుతున్నాయి.
గత ఏడాది కొవిడ్‌ కారణంగా నాలుగైదు నెలల పాటు వేట సాగలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మత్స్యకారుల్లో అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంక్షలు సడలించిన తర్వాత చేపలు, రొయ్యల వేట మొదలైంది.
ఆరంభం నుంచి ముగింపు వరకు వేట ఆశాజనకంగా సాగింది. ఫలితంగా దిగుబడులు పెరిగాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సీజన్‌లో 29,995 టన్నుల సముద్ర రొయ్యలు లభిస్తాయని భావించగా, 33,575 టన్నుల దిగుబడి వచ్చింది. గత సీజన్‌లో కేవలం 25009 టన్నులు మాత్రమే లభించాయి. వీటితో పాటు చెరువుల్లో పెంచిన రొయ్యలు 6878 టన్నుల మేర లభ్యం అయ్యాయి. ఈ రెండింటి  విలువ రూ.1076 కోట్లు ఉంటుందని అధికారిక అంచనా. ఇక సముద్ర చేపలు ప్రస్తుత సీజన్‌లో 100282 టన్నులు లభ్యం అయ్యాయి.
చెరువుల ద్వారా 57,335 టన్నులు దిగుబడి సాధించాయి. వీటి విలువ కలిపి రూ.1575కోట్లు ఉంటుందని అంచనా. రెండింటి విలువ వెరసి రూ.2651కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత సీజన్‌లో విశాఖకు చెందిన బోట్లు బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోకి వెళ్లడం, వైపరీత్యాల సమయంలో ఎదురైన ఇబ్బందులు మినహా ఇతరత్రా ఘటనలు చోటు చేసుకోకపోవడంతో మత్స్య పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటను సముద్ర జలాల్లో నిషేధించారు. ప్రస్తుత సీజన్‌ ముగియనుండటంతో తీరంలో దూర ప్రాంతాల్లో వేట సాగిస్తున్న బోట్లు ఒక్కొక్కటీ చేపలరేవుకు చేరుకుంటున్నాయి. డీజిల్‌ ధరలు గణనీయంగా పెరగడం పరిశ్రమను కలవరపాటుకు గురిచేసింది.

సంప్రదాయ బోట్లకు అనుమతి...
సముద్ర తీరంలో 61 రోజులపాటు చేపల వేటను ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది. యాంత్రిక, ఇంజను బోట్లేవీ ఈ సమయంలో వేట సాగించరాదు. సంప్రదాయ బోట్లు మాత్రం పరిమిత ప్రాంతంలో అన్‌సీజన్‌ సమయంలో వేట సాగించుకోవచ్చు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వేటాడే బోట్లు, వాటిలో ఉండే వలలు, మత్స్యరాశులను సీజ్‌ చేస్తాం. ఈ సమయంలో చేపలు, రొయ్యల ఎదుగుదల ఉంటుందని, ఈ కారణంగా వేటను నిషేధిస్తున్నాం. వేట విరామ సమయంలో బోట్లపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ప్రభుత్వం పరిహారంగా ఇవ్వనున్నది.

-పి.లక్ష్మణరావు, సంయుక్త సంచాలకులు, మత్స్యశాఖ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని