Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాలంతో పోటీ పడలేక...

మూతకు సిద్ధంగా ఏయూ ముద్రణ విభాగం

ఏయూ ముద్రణ విభాగం

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ముద్రణ విభాగం మూతపడడానికి రంగం సిద్ధమైంది. విశ్వవిద్యాలయ అవసరాలకు వీలుగా 1962లో దీన్ని స్థాపించారు. వేలాది మంది విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ప్రశ్నపత్రాలు, సమాధాన బుక్‌లెట్‌లు, ఇతర పత్రాలను ఈ విభాగమే ముద్రించేది. అత్యంత రహస్యంగా జరిగే ప్రశ్నపత్రాల ముద్రణకు అవసరమైన ప్రక్రియ కోసం అండర్‌గ్రౌండ్‌లో ప్రత్యేకంగా రెండు గదులు కూడా నిర్మించడం విశేషం. ఒకానొక దశలో 140 మంది ఉద్యోగులు, మరికొందరు ఒప్పంద ఉద్యోగులు విధులు నిర్వర్తించేవారు.
ఏయూ దూర విద్య విభాగంలో చదువుకునే విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలన్నీ కొన్ని సంవత్సరాలపాటు ఇందులోనే ముద్రించారు. తెలుగు అకాడమీ పుస్తకాలను కూడా ముద్రించిన సందర్భాలున్నాయి. అప్పట్లో రష్యా, జర్మనీ దేశాల నుంచి యంత్రాలను తెచ్చారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా ఆ విభాగం ఆధునికతను సంతరించుకోలేకపోయింది. ఆలస్యంగా కొత్త యంత్రాలను, పరిజ్ఞానాలను అందిపుచ్చుకున్నప్పటికీ వాటిని ఉపయోగించి పనులు సకాలంలో పూర్తిచేయడంలో జాప్యం జరుగుతుండడం శాపంగా మారింది. దీంతో ముద్రణ ఆలస్యమైతే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కొంత శాతం పనుల్ని మాత్రమే ఆ విభాగానికి అప్పగించేవారు.
ప్రశ్నపత్రాలను ఇక్కడ ముద్రించడం మానేసి ఏళ్లు గడుస్తోంది. దూరవిద్య విభాగం కూడా పుస్తకాల ముద్రణను అత్యల్ప శాతానికి మాత్రమే పరిమితం చేసింది. బయట వ్యక్తుల పుస్తకాల ముద్రణ కూడా ఎప్పుడో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పలువురు సిబ్బంది ఉద్యోగ విరమణ చేయడం, వారి స్థానాల్లో ఇతరులు భర్తీ కాకపోవడంతో చివరకు ఆ విభాగ నిర్వహణ వర్సిటీకి భారంగా మారింది.
గత నెలాఖరులో ముద్రణ విభాగానికి చెందిన సుమారు 12 మందిని వివిధ విభాగాలకు బదిలీ చేశారు. దీంతో ఈ విభాగంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. నామమాత్రంగా మిగిలిన ఆ ఐదుగురితో ఆ విభాగం నడపడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వివిధ విశ్వవిద్యాలయాల దూరవిద్య విభాగాలు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడానికి బదులుగా పీడీఎఫ్‌ కాపీలు, సీడీలు ఇస్తున్నాయి. అంతర్జాల చిరునామాల్లో పాఠ్యాంశాల బోధన వీడియోలు అందుబాటులో ఉంచుతున్నాయి. పరిపాలన కూడా కాగిత రహితంగా ఆన్‌లైన్‌లో జరిగే సంస్కృతిని కూడా చాలా సంస్థలు ఏళ్ల నుంచే అమలు చేస్తున్నాయి. దీంతో ఏయూ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని