Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి...పూర్వ వైభవం!

రూ.పది కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు


ఈనాడు, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసులతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల వాసులకు కూడా సుమారు 26 రకాల క్యాన్సర్లకు నామమాత్రపు రుసుములతో వైద్య సేవలు అందించిన లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి మళ్లీ తన కార్యకలాపాల్ని పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది.
1980లలో విశాఖలో క్యాన్సర్‌కు తగిన సంఖ్యలో ఆసుపత్రులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు, నగరంలోని కొందరు ప్రముఖులు అత్యాధునిక క్యాన్సర్‌ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. నాటి వుడా ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించిన డి.వి.సుబ్బారావు దృష్టిలో ఆ విషయాన్ని పెట్టగా సీతమ్మధారలో లయన్స్‌ కేన్సర్‌ ఆసుపత్రి నిర్మాణానికి 1168 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.
లయన్స్‌ క్లబ్ల్‌ సభ్యులు, లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ నిధులు, దాతలందరూ కలిసి సుమారు రూ.5కోట్ల వరకు విరాళాలు సేకరించగలిగారు. కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలను గ్రాంటుగా విడుదల చేసింది. దీంతో కెనడా నుంచి థెరట్రాన్‌ 780 టెలీ కోబాల్ట్‌ యంత్రాన్ని దిగుమతి చేసుకున్నారు. ఆసుపత్రికి అనతికాలంలోనే పేదల నుంచి విపరీతమైన స్పందన రావడంతో పది పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి కాస్తా ఏకంగా వంద పడకలకు చేరింది. ఐదు అంతస్తుల భవనాన్ని సమకూర్చుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడ్డపొగ తాగి ఎక్కువ మంది నోరు, గొంతు క్యాన్సర్ల బారిన పడుతుండేవారు. అలాంటి వారందరికీ లయన్స్‌ ఆసుపత్రి అండగా ఉండేది. దానికి అనుబంధంగా హెచ్‌.డి.ఆర్‌.(హైడోస్‌ రేడియో థెరపీ) విభాగాన్ని 2008లో ప్రారంభించారు. నెదర్లాండ్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ యంత్రం క్యాన్సర్‌ నివారణలో మరింత ఉపయుక్తంగా ఉండేది. 2014 వరకు ఈ యూనిట్‌ సేవలందించింది.

ప్రైవేటు రంగంలో అత్యాధునిక యంత్రాలపై క్యాన్సర్‌ వైద్యం అందుబాటులోకి రావడంతో లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రాభవం తగ్గింది. దీంతో 2019 నుంచి కోబాల్ట్‌ యంత్రం ఉపయోగించి ఇచ్చే రేడియోథెరపీని నిలిపివేయాల్సి వచ్చింది. క్యాన్సర్‌ వైద్య నిపుణులు రోగుల్ని పరీక్షించి మందులివ్వడం, శస్త్రచికిత్సలు చేయడం తదితరాల్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారి నుంచి నామమాత్రపు రుసుములు కూడా లేకుండా పూర్తి ఉచిత సేవలు అందిస్తారు.

మరిన్ని సేవలు అందుబాటులోకి: విశాఖ లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో వేలాది మందికి పలు రకాల క్యాన్సర్లకు నామమాత్రపు రుసుములతో సేవలు అందించింది. తాజాగా అత్యాధునిక యంత్ర పరికరాల్ని సమకూర్చుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నాం. ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకుని మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే వారందరికీ దాతల విరాళాలతో ఉచితంగానే భోజనాలు అందిస్తున్నాం. క్యాన్సర్‌ వైద్యంతోపాటు సాధారణ వ్యాధులకు కూడా అవసరమైన వైద్యం అందుబాటులోకి తెచ్చాం.

- డాక్టర్‌ వి.ఉమామహేశ్వరరావు, మేనేజింగ్‌ ట్రస్టీ, లయన్స్‌ క్యాన్సర్‌

ఆసుపత్రి, విశాఖపట్నంఆధునికయంత్రం
కొనుగోలుకు రంగం సిద్ధం

బెంగళూరుకు చెందిన పనాసియా సంస్థ అభివృద్ధి చేసిన సిద్ధార్థ్‌-2 లినాక్‌ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. సుమారు రూ.10కోట్లతో అభివృద్ధి ప్రణాళికల్ని తయారుచేసి అమలు చేయడానికి లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ట్రస్ట్‌బోర్డ్‌ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
అంతిమ దశలో తీవ్ర అనారోగ్యాలతో కొందరు శారీరక బాధలను అనుభవిస్తుంటారు. వారికి ఒకింత ఉపశమనం ఉండాలంటే వైద్యులు, నర్సుల సేవలు అవసరం. అలాంటి వారికి సేవలు అందించడానికి వీలుగా పాలియేటివ్‌ కేర్‌ విభాగాన్ని ప్రారంభించారు.  
ఇటీవలి కాలంలో పలువురు పిల్లలు కూడా క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అలాంటి వారికోసం కూడా ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు.
నామమాత్రపు రుసుములతో సాధారణ వైద్య సేవలు అందించే విభాగాన్ని కూడా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని రకాల వ్యాధులకు నిపుణులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు.
లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలోనూ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను వేస్తున్నారు. సీతమ్మధార నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌ అభయాంజనేయస్వామి గుడి రోడ్డులో లయన్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల వాసులు అక్కడే టీకాలు వేయించుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని