Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రత్యామ్నాయం.. ప్రయోజనమేనా..?

న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం(కాపుజగ్గరాజుపేట)

కాపుజగ్గరాజుపేట రైల్వే గేటు సమీపంలో నిర్మించిన సబ్‌ వే

కూర్మన్నపాలెం దరి కాపుజగ్గరాజుపేట రైల్వేగేటుకు ప్రత్యామ్నాయంగా వాహనదారుల రాకపోకల కోసం నిర్మించిన సబ్‌ వేపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అనాలోచిత నిర్ణయం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయని స్థానిక గ్రామాల ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
దువ్వాడ వైపు నుంచి నగరంలోకి వచ్చే ప్రతి రైలు కాపుజగ్గరాజుపేట రైల్వే ట్రాకు మీదుగానే రావాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడ గేటును ఎక్కువ సమయం మూసి ఉంచాల్సి రావడం, వాహనచోదకుల నిరీక్షణ, ట్రాఫిక్‌ అవస్థలు... ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయంగా సబ్‌ వే నిర్మాణం చేపట్టారు.
పక్కా ప్రణాళిక ప్రకారం కాకుండా... ఏదో నామమాత్రంగానే నిర్మాణం చేపట్టి వదిలేస్తున్నారని పరిసర ప్రాంత కాలనీల నివాసితులు, ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.బీ సబ్‌ వే నిర్మాణంతో ఇప్పుడున్న అవస్థలు మరింత రెట్టింపు అయ్యేలా ఉన్నాయని వారంతా వాపోతున్నారు.

అడ్డుగా పైపులైన్‌ కల్వర్టు
సబ్‌ వే నుంచి ఆటోనగర్‌ వైపు అనుసంధానం చేయనున్న రహదారి నిర్మాణంపై రైల్వే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. లోతుగా ఉన్న సబ్‌ వే లో నుంచి వచ్చే వాహనాలు రెండు రైల్వే ట్రాకుల మధ్య ఇరుకు స్థలంలో మలుపు తిరగాల్సి ఉంటుంది. సరిగ్గా మలుపు వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పైపులైను కల్వర్టు నిర్మాణం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలలుగా పనులు నిలిపివేశారు. ఇటీవలే మళ్లీ పనులు పునఃప్రారంభించడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా, పనులు ఏ విధంగా చేపడుతున్నారో... చెప్పకుండా అధికారులు ముందుకు సాగడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పైపులైను కల్వర్టు

రైల్వే గేటు మూసివేస్తారా..?
ఇక్కడ సబ్‌ వే నిర్మాణం పూర్తయితే నిత్యం రద్దీగా ఉండే కాపుజగ్గరాజుపేట రైల్వే గేటు మూసేసే అవకాశాలే ఎక్కువ. మ్యాన్యువల్‌గా నిర్వహిస్తున్న రైల్వేగేట్లకు ప్రత్యామ్నాయంగా అండర్‌ పాత్‌ వేలు నిర్మించాలన్న ప్రతిపాదనతోనే రైల్వేశాఖ ముందుకొచ్చి.. సబ్‌ వే నిర్మిస్తుంది.
ఇదేం నిర్మాణం..?
ఇక్కడ రైల్వే గేటు నుంచి విశాఖ వచ్చే మార్గం వైపు చేపట్టిన సబ్‌ వే నిర్మాణంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరుకుగా నిర్మించిన మార్గంలో కేవలం ద్విచక్ర వాహనాలు తప్పితే... ఆటోలు గాని, కార్లు గాని వెళ్లాలంటే ట్రాఫిక్‌ సమస్య తలెత్తేలా ఉందని చెబుతున్నారు. బస్సులు, మినీ వ్యానులు, విద్యాలయాల బస్సులు, లారీల రాకపోలకు అవకాశమే లేదు. వర్షం వస్తే నీరంతా లోతుగా ఉన్న అండర్‌ పాత్‌ వేలో నిలిచిపోతుందని, అప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కాపుజగ్గరాజుపేట నుంచి ఆటోనగర్‌ వైపు వచ్చేందుకు వీలుగా రెండు ట్రాకుల మధ్య ఇరుకు ప్రాంతంలో సబ్‌ వేకు అనుసంధానంగా నిర్మించే  రహదారి వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. బీ సబ్‌ వేకు ఇరువైపులా నిర్మిస్తున్న అనుసంధాన రహదారుల నిర్మాణంలో నిబంధనలు అమలు చేయడం లేదని, ఇలా అయితే నిత్యం ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టుకునే ప్రమాదం ఉంటుందని వారంతా ఆందోళన చెందుతున్నారు.
దువ్వాడ పై వంతెనే గతి..!
ఇక్కడ రైల్వే గేటు మూసివేస్తే సబ్‌ వే నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. అప్పుడు బస్సులు, లారీలు ఇతర వాహనాలన్నీ దువ్వాడ పై వంతెన మీదుగా రైల్వేస్టేషన్‌ నాలుగో ప్లాట్‌ఫామ్‌ పక్క నుంచి విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మార్గంలో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అలా చుట్టూ తిరిగి రావాలంటే... కష్టమేనని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

ఇప్పటికైనా అధికారులు ఆలోచించి.... సబ్‌ నిర్మాణంలో మార్పులు చేసి, ప్రయాణం సులువుగా సాగేలా అనుసంధాన రహదారులు నిర్మించాలని వాహనచోదకులు, పరిసర గ్రామస్థులు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని