రోగులకు అందుబాటులోకి వెంటిలేటర్లు
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోగులకు అందుబాటులోకి వెంటిలేటర్లు

పాడేరు, న్యూస్‌టుడే: ఏజెన్సీలోని పదకొండు మండలాలకు పెద్దాసుపత్రిగా ఉన్న పాడేరు జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించేందుకు వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. గత ఏడాది ప్రభుత్వం 25 వెంటిలేటర్లను మంజూరు చేయగా.. ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణుడు అందుబాటులో లేకపోవడంతో వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది. ఈ నెల మూడో తేదీన ఊపిరందక ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనిపై ‘అత్యవసరానికి అందని ఊపిరి’ శీర్షికన ఈ నెల 3న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్‌, వైద్య విధాన పరిషత్తు ఉన్నతాధికారులు ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులు, కొవిడ్‌ రోగులకు అందుతున్న వైద్య సేవలపై దృష్టిసారించారు. వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. మత్తు వైద్యానికి సంబంధించి సాంకేతిక సలహాదారుడిని తాత్కాలిక ప్రాదిపదికన నియమించారు. వెంటిలేటర్లను పడకలకు అనుసంధానం చేశారు. వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందించే ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని, ఇకపై అత్యవసర కొవిడ్‌ కేసులను కేజీహెచ్‌కు తరలించాల్సిన అవసరం ఉండదని వైద్యులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని