మృత్యు ఘోష
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మృత్యు ఘోష

పెరుగుతున్న మరణాలు

పాడేరు, న్యూస్‌టుడే: ఏజెన్సీలో శనివారం ఒక్కరోజే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తాజాగా 278 మందికి పరీక్షలు చేయగా 31 మందికి పాజిటివ్‌గా తేలిందని ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌ పేర్కొన్నారు. ‘మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు, డుంబ్రిగుడ, గన్నెల పీహెచ్‌సీల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు 26,482 మందికి పరీక్షలు నిర్వహించగా 946 మందిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 140 కోలుకుని డిశ్చార్జి కాగా, 642 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 18 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 788 మంది వరకు ఉన్నా’యని ఆయన చెప్పారు. పాడేరు వైటీసీలో 200 పడకలు అందుబాటులో ఉండగా.. 118 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. పాడేరు ఆసుపత్రిలో మరో 60 మంది ఉన్నారని వైటీసీ కొవిడ్‌ కేర్‌ ఇన్‌ఛార్జి రజిని పేర్కొన్నారు.

వైద్యుని తల్లి..

నాతవరం, న్యూస్‌టుడే: నాతవరం వైద్యాధికారి ప్రసన్న తల్లి ఎస్‌.వరలక్ష్మి (55) శనివారం మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. కొవిడ్‌ బారిన పడిన ఆమె విశాఖలో వైద్యం పొందుతూ మృతి చెందారన్నారు.

మారేడిపూడిలో వ్యక్తి..

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మారేడిపూడి గ్రామానికి చెందిన వ్యక్తి(50) కరోనాతో శనివారం మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనాబారిన పడి హోం ఐసొలేషన్‌లో ఉన్న ఈయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఉపాధ్యాయుడు..

అనంతగిరి: శివలింగపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆనంద్‌రావు కరోనాతో మృతి చెందారు. 20 రోజుల కిందట పాజిటివ్‌గా తేలడంతో డుంబ్రిగుడలోని స్వగృహంలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. పరిస్థితి విషమించి శనివారం మృతి చెందారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

కండక్టర్‌...

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న నాయుడు(36) అనారోగ్యంతో మృతి చెందినట్లు డీఎం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈయన తన మొదటి డోస్‌ టీకాను గత నెల 28వ తేదీన వేయించుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధ పడతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండే వారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఊపిరందక మృతి చెందినట్లు కుటుంబీకులు సమాచారం అందించినట్లు చెప్పారు.

చోడవరంలో రైస్‌ మిల్లు డ్రైవర్‌...

చోడవరం: పట్టణంలోని యడ్లవీధి నివాసితుడైన ఓ రైస్‌ మిల్లు డ్రైవర్‌ కరోనాతో చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్‌లో శనివారం మధ్యాహ్నం మృతి చెందారు.

సిరిబాలలో గిరిజనుడు...

గూడెంకొత్తవీధి: మండలంలోని సిరిబాల గ్రామానికి చెందిన గిరిజనుడు చల్లంగి సోమలింగం కరోనాతో మృతి చెందారు. ఐదు రోజుల కిందట కరోనా లక్షణాలతో గూడెంకొత్తవీధి పీహెచ్‌సీకి రాగా నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. పాజిటివ్‌గా ఫలితం రాగా.. హోం ఐసొలేషన్‌లో ఉన్న అతడు పరిస్థితి విషమించి శనివారం మరణించారు.

కొవిడ్‌తో ఇద్దరు జీవీఎంసీ ఉద్యోగుల మృతి

గాజువాక, న్యూస్‌టుడే : జీవీఎంసీ గాజువాక జోనల్‌ కార్యాలయంలో ఉద్యోగులపై కొవిడ్‌ పంజా విసురుతోంది. జోన్‌-6 పట్టణ ప్రణాళిక విభాగం ఛైన్‌మెన్‌(ఎంటీఎస్‌) ఎస్‌.దేవుడు (52), లైసెన్స్‌డ్‌ సర్వేయరు శాంతారావు (59) గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఇటీవలే నీటి సరఫరా విభాగం బోర్వెల్‌ సెక్షన్‌ సూపర్వైజర్‌ రమేష్‌ కూడా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జోన్‌-6లో ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ ప్రసాద్‌బాబు, నీటి సరఫరా ఏఈ రాజ్‌కుమార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు పద్మశ్రీ, రమేష్‌నాయుడు, మానిటరింగ్‌ సెల్‌ అడ్మిన్‌ కార్యదర్శి శాంతిరాజ్‌లు కొవిడ్‌తో బాధపడుతున్నారని జోనల్‌ కార్యాలయ ఇన్‌ఛార్జి సీతారామయ్య తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కొవిడ్‌ బాధితులుగా మారడంతో కార్యాలయం వద్ద ప్రవేశాలను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఇదే సీజనులో ఒక ఏఈ, నలుగురు ఉద్యోగులు కొవిడ్‌తో మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని