టీకా దైవాధీనం..!
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా దైవాధీనం..!

 

అరకొర నిల్వలతో వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు

రెండో డోసు వేయించుకోవాల్సిన వారిలో ఆందోళన

పాయకరావుపేట మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తన కుటుంబసభ్యులకు రెండో డోసు కొవాగ్జిన్‌ టీకా కోసం పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కోటవురట్ల పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ వేస్తారనే సమాచారంతో వారితోపాటు మరికొందరు కలిసి కారులో బయలుదేరారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత టీకాలు వేయడం లేదు.. మరుసటి రోజు రావాలన్నారు. రెండోరోజు వెళ్లినా.. అదే సమాధానం. ఈ విషయాన్ని పీహెచ్‌సీ పరిశీలనకు వచ్చిన నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ మౌర్య దృష్టికి తీసుకురాగా.. ఆమె దగ్గరుండి వారికి వ్యాక్సిన్‌ వేయించారు.

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన పి.శ్రీనివాసరావు కొవాగ్జిన్‌ మొదటి డోసు తీసుకుని నెల రోజులు అవుతోంది. రెండో డోసు వేసుకోవాలని సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వచ్చింది. దీంతో ఆయన తుని, పాయకరావుపేట పీహెచ్‌సీల్లో ప్రయత్నించారు. ఎక్కడా దొరకలేదు. చివరికి ఎలమంచిలి మండలం రేగుపాలెంలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారని తెలిసి 40 కి.మీ. ప్రయాణం చేసి వచ్చి టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

విశాఖపట్నంలోని కంచరపాలెంకు చెందిన వెంకటరావుకు కొవాగ్జిన్‌ రెండో డోసు కోసం ఇటీవల ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో టోకెన్‌ ఇచ్చారు. ఆ టోకెన్‌ నంబరు వచ్చే నాటికే టీకా కేంద్రంలో వ్యాక్సిన్లు అయిపోయాయి. మరోసారి రండి వేస్తామని తిప్పి పంపారు. మూడు, నాలుగు రోజులు తిరిగితేగానీ వ్యాక్సిన్‌ అందలేదు.

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

జిల్లాలో వ్యాక్సినేషన్‌ దైవాధీనంగా మారింది. ఎప్పుడు టీకాలు వస్తాయో.. ఎక్కడ వేస్తారో.. ఎంత మందికి వేస్తారో అన్న విషయం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకే స్పష్టత ఉండటం లేదు. వచ్చిన టీకాల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ సిబ్బంది కోసం తీసుకుపోతున్నాయి. అధికార పార్టీ నాయకులు తమ అనుచరుల కోసం ప్రత్యేక టీకా కార్యక్రమాలను రహస్యంగా చేపడుతున్నారు. ఉన్న అరకొర టీకాలను కేంద్రాలకు సర్దుబాటు చేస్తున్నారు. టీకా కోసం వచ్చే వారు ఎక్కువగా ఉంటే.. కేంద్రాల్లో నిల్వలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఎవరు ముందు వచ్చి టోకెన్‌ తీసుకుంటే వారికే టీకా వేస్తున్నారు. కొన్నిచోట్ల టోకెన్లు ఉన్నా.. టీకాలు అందని వారు చాలా మంది ఉంటున్నారు.

దేవరాపల్లి పీహెచ్‌సీ వద్ద వ్యాక్సిన్‌ కోసం బారులు (పాతచిత్రం)

1.34 లక్షల మందికే రెండో డోసు

జనవరిలో వ్యాక్సినేషన్‌ మొదలైంది. ఇప్పటి వరకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ కలిపి సుమారు 6.54 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారే 5.2 లక్షల మంది ఉన్నారు. వీరిలో రెండో డోసు తీసుకున్న వారు 1.34 లక్షల మందే. మొదటి డోసు తీసుకున్న వారు నాలుగు నుంచి ఆరు వారాలలోపు రెండో డోసు విధిగా తీసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తోంది. కాకపోతే రెండో డోసుకు సరిపడా నిల్వలు జిల్లాకు రాకపోవడంతో టీకా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. రెండో డోసు కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నా.. పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారు.
కొవాగ్జిన్‌ కోసం తంటాలు : మొదటి నుంచి కొవాగ్జిన్‌ నిల్వలు తక్కువగానే వస్తున్నాయి. జిల్లాలో సుమారు 1.12 లక్షల మంది కొవాగ్జిన్‌ టీకా మొదటి డోసు వేసుకున్నారు. వీరిలో 40 వేల మంది వరకు ఏప్రిల్‌ నెలాఖరు నాటికి రెండో డోసు వేసుకోగలిగారు. ఆ తర్వాత మరో 27 వేల డోసులు కొవాగ్జిన్‌ నిల్వలు జిల్లాకు వచ్చాయి. దీంతో 50 శాతం మంది రెండో డోసు వేసుకున్నా.. మిగతా 50 శాతం మంది నిరీక్షించాల్సి వస్తోంది. నిర్దేశిత గడువులోగా టీకా వేసుకోకుంటే మొదటి డోసు పనిచేస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

రెండో డోసు కోసం శనివారం పది కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఆ పది కేంద్రాల్లో అనకాపల్లి కేంద్రం మినహాయించి మిగతావన్నీ నగర పరిధిలోనివే కావడం విశేషం.

గ్రామీణ ప్రాంతంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ అందుబాటులో ఉండటం లేదు. ఒకవేళ ఇచ్చినా 200 నుంచి 300 మందికి మించి సరిపడా నిల్వలు ఇవ్వడం లేదు. పీహెచ్‌సీల్లో టీకాలు ఎప్పుడు వేస్తున్నారనే సమాచారం ఇవ్వడం లేదు. ఒకసారి టీకాలు వేస్తే వారం రోజులపాటు ఆ కేంద్రంలో వ్యాక్సిన్లు వేయడం లేదు.

ఇబ్బంది ఉన్నా అందరికీ ఇస్తాం..

వ్యాక్సినేషన్‌లో కొంత ఇబ్బంది ఉన్నా అందరికీ టీకాలు వేస్తాం. రెండో డోసు కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నాం. ఇప్పటికే 80 శాతం మందికి రెండో విడత టీకాలు వేశాం. దశలవారీగా టీకాలు వస్తున్నాయి. వచ్చిన వెంటనే అందరికీ సమాచారం ఇస్తూ వ్యాక్సిన్లు వేస్తున్నాం. ఎక్కడా దుర్వినియోగం కానివ్వడం లేదు.

- సూర్యనారాయణ, డీఎంహెచ్‌వో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని