అమ్మ గెలిచింది
Published : 09/05/2021 06:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ గెలిచింది

పిల్లలు ఏమైపోతారనే ఆలోచనే బతికించింది

ఈనాడు డిజిటల్‌ - విశాఖపట్నం, న్యూస్‌టుడే - నర్సీపట్నం అర్బన్‌, అనకాపల్లి పట్టణం, పాయకరావుపేట

కరోనా రక్కసి కళ్లెదుటే కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు ఊరూరా వ్యాప్తి చెందుతోంది. చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది. అందులో మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. మహమ్మారిపై యుద్ధంలో కొందరు అలిసిపోయి ప్రాణాలు వదిలినా.. చాలామంది పోరాడి పైచేయి సాధించారు. ఆదివారం మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా కొవిడ్‌ బారినపడి కోలుకున్న అమృతమూర్తులతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది. ‘కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకున్నాం. పాజిటివ్‌గా తేలినా భయంతో కుంగిపోలేదు. కుటుంబ సభ్యుల తోడ్పాటు, వైద్య సిబ్బంది ఇచ్చిన ధైర్యంతో త్వరితగతిన కోలుకున్నామని’ చెబుతున్నారు.

బిడ్డకు సోకకుండా..

అనకాపల్లిలోని శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన ధనలక్ష్మికి 9 నెలల బాబు ఉన్నాడు. 20 రోజుల కిందట ఈమెకు జ్వరం వచ్చింది. అనుమానం వచ్చి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. మొదట కొంత భయపడ్డారామె. నెలల వయసున్న బాబు ఇంట్లో ఉన్నాడని కంగారు పడ్డారు. హోం ఐసొలేషన్‌లో ఉండి కిట్‌లోని మందులను వాడాలని వైద్య సిబ్బంది సూచించారు. తాను ఇంట్లో ఉంటే బాబూ వైరస్‌ బారిన పడతాడని అమ్మమ్మ ఇంటికి పంపారు. మందులతోపాటు పోషకాహారం ఆహారం తీసుకోవడంతో త్వరగా కోలుకున్నారు. ‘బాబును తీసుకొచ్చేస్తా. కరోనా వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే ఏ ప్రమాదం ఉండద’ని ధనలక్ష్మి పేర్కొన్నారు.

సంకల్పంతో మహమ్మారిపై మాతృమూర్తుల పోరాటం

జ్వరం వచ్చింది. అనుమానం వచ్చి సచివాలయం వద్ద పరీక్ష చేయించుకున్నా. ఫలితం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. మరుసటి రోజు ఆయాసం అనిపించింది. వెంటనే నర్సీపట్నం ఆసుపత్రికి వెళ్లా. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. తొలుత భయపడ్ఢా తర్వాత ధైర్యం తెచ్చుకున్నా. భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలు ఏమైపోతారోనన్న ఆలోచనలు మెదిలాయి. కూడదీసుకుని ధైర్యం తెచ్చుకున్నా. ఆక్సిజన్‌ తీసుకుంటూ కరోనా నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకున్నానని చెప్పారు శెట్టివానిపాలెం గ్రామానికి చెందిన గొర్లి గంగతల్లి.

కుటుంబమే బలం

నీరసంగా ఉంటే ఇంటి దగ్గరే రక్తపరీక్ష చేయించుకున్నా. టైఫాయిడ్‌ జ్వరమని చెప్పడంతో మందులు వాడా. అయినా.. తగ్గకపోవడంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. నెగెటివ్‌గా ఫలితం వచ్చింది. జ్వరం తగ్గకపోతే నర్సీపట్నంలో సిటీస్కాన్‌ తీయించుకోగా పాజిటివ్‌గా తేలింది. కుటుంబ సభ్యులంతా అంబులెన్స్‌లో విశాఖపట్నం తీసుకెళ్లారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పడకలు లేవన్నారు. దూరం నుంచే పొమ్మన్నారు. చేసేది లేక తిరిగి అంబులెన్సులో నర్సీపట్నం వచ్చేశాం. ఎమ్మెల్యే గణేష్‌ స్పందించి ప్రాంతీయ ఆసుపత్రికి పంపగా వైద్యులు పడక కేటాయించారు. సమయానికి మందులు, అల్పాహారం, భోజనం అందించడంతో ఆరు రోజుల్లోనే కోలుకున్నా’నని కోరుకొండ వరలక్ష్మి చెప్పారు.

ఒకరికొకరు ధైర్యం చెప్పుకొన్నాం

ఒంట్లో నలతగా అనిపించింది. ఆ తర్వాత వాసన తెలియలేదు. వెంటనే ఇంట్లో ఐదుగురం కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాం. పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన చెందా. ఇద్దరు పిల్లలు, అమ్మ ఉన్నారు. ధైర్యం తెచ్చుకుని వైద్యుని సూచనలతో హోం ఐసొలేషన్‌లో ఉండిపోయాం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడంతోపాటు బలవర్ధక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకున్నాం. మూడు గంటలకోసారి ఆక్సీమీటర్‌పై ఆక్సిజన్‌ స్థాయిలు పరిశీలించుకునే వాళ్లం. కుటుంబ సభ్యులందరం ఒకరికి ఒకరం ధైర్యం చెప్పుకొన్నాం. ఆత్మవిశ్వాసంతో కరోనా నుంచి కోలుకోగలిగాం. పద్నాలుగు రోజుల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఏ దశలోనూ నమ్మకాన్ని వీడలేదు. బెంగ పడ్డామో.. ఇబ్బంది పడే అవకాశముంది. ఆందోళన వీడి వైద్యం పొందగలిగితే మహమ్మారిని జయించవచ్ఛు

- వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే

స్వచ్ఛంద సేవ

కరోనా రోగులకు భోజనం, మందులు అందజేత

నర్సీపట్నం, న్యూస్‌టుడే : ఆమె స్వచ్ఛంద సేవకురాలు. కరోనా మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు మందులతోపాటు రోజూ రెండు పూటలా భోజనం అందిస్తున్నారు నర్సీపట్నానికి చెందిన ఇండిపూడి అశ్వని. చేయూత గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంస్థ (ఎన్జీవో)కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఈమె బీఏ వరకు చదువుకున్నారు. నర్సీపట్నం, గబ్బాడ, వేములపూడి, మాకవరపాలెం తదితర గ్రామాల్లో రోజూ ఉదయం, సాయంత్రం 142 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 270 మందికి మందుల కిట్లు అందజేశారు. ప్రభుత్వం రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించడంతో సేవకు ఆటంకం రాకుండా పోలీసులు గుర్తింపు కార్డులు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని