టీకా కొందరికే.. అందేనా అందరికీ!
Published : 09/05/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా కొందరికే.. అందేనా అందరికీ!

చేతులెత్తేస్తున్న యంత్రాంగం
కాళ్లరిగేలా తిరుగుతున్న నగరవాసులు
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే బృందం

కొవిడ్‌ టీకా ప్రక్రియ మొత్తం గందరగోళంగా మారింది.. ఏం జరుగుతుందో అధికారులకే అర్థం కావడంలేదు... సామన్య ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఏరోజు ఏ కేంద్రంలో ఎవరికి టీకా వేస్తారనే కనీస సమాచారం లేదు.ఆ జాబితా కూడా ఎవరి వద్దా లేదు. అంతా ఇష్టారాజ్యం. టీకా కోసం రోజుల తరబడి తిరగడమే జనాలు పనిగా పెట్టుకున్నారు.
వ్యాక్సినేషన్‌ ఒక క్రమపద్ధతిలో జరిగేందుకు అధికారులు కూడా చొరవ తీసుకోవడంలేదు. వ్యవస్థల వైఫల్యం జనాలకు శాపంగా మారుతోంది.
కొవీషీల్డ్‌ మొదటి డోసు వేసుకున్నాక 4-8 వారాలకు రెండోది వేయాలి. కొవాగ్జిన్‌ మొదటి డోసు అయ్యాక 4-6 వారాల్లోపు రెండోది ఇవ్వాలి. మొదటి డోసు నుంచి వ్యాక్సిన్‌ పని చేయడం ప్రారంభమయ్యేదాకా.. కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే. లేకపోతే తిరిగి వైరస్‌ సోకొచ్చు అనేది వైద్యులు చెప్పేమాట. కాని నగరంలోని చాలా టీకా కేంద్రాల్లో కనీసం కొవిడ్‌ నిబంధనలు పాటించడంలేదు. ఎక్కడ చూసినా తోపులాటలు, వాగ్వాదాలు, గంటల తరబడి పడిగాపులు, గుంపులుగా ఉండటం కనిపిస్తోంది. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందేమో అనిపిస్తోంది.
10 నుంచి 13శాతం మందికే: గాజువాక పీహెచ్‌సీలో రోజూ రెండో డోసు టీకా కోసం వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. 1000 మందికి పైగా వస్తే.. కేవలం 100, 130 మందికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. కొవీషీల్డ్‌ కోసం జనాలొస్తే.. ‘అది లేదు, కొవాగ్జిన్‌ ఉంది’ అనడంతో వందలాది మంది ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిన దుస్థితి. కొవాగ్జిన్‌, కొవీషీల్డ్‌ ఎక్కడెక్కడ వేస్తున్నారో సమాచారం ఉండటం లేదని జనాలంటున్నారు.
మెసేజ్‌లు చూపినా లాభంలేదు
తొలిడోసు వేసుకున్న వారికి రెండో డోసు వేసే కేంద్రాలు, తేదీ, ఇతర వివరాలతో మొబైల్‌లకు సందేశాలొచ్చాయి. వీటిని పట్టుకుని ఆరిలోవ్‌ జీవీఎంసీ ఎఫ్‌ఆర్‌యూ కేంద్రానికి జనాలు చేరుకుంటున్నారు. 600 నుంచి 700 మంది దాకా జనాలొస్తే.. కేవలం 300 మందికే టోకెన్‌లు ఇచ్చి ఇక టీకాల్లేవని చెప్పేస్తున్నారు. దీంతో అక్కడ తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి.

నీరసించినా అంతే..

టీకా పంపిణీలో అధికార యంత్రాంగం ఏమాత్రం సన్నద్ధతతో లేదనడానికి చినవాల్తేరు ఆరోగ్య కేంద్రం ఒక ఉదాహరణ. ఇక్కడ టీకాల కోసం తెల్లవారుజామున 5, 6 గంటల నుంచి వేచిచూసినా అతికొద్ది మందికే ఇచ్చి మిగిలిన వారిని వెనక్కి పంపుతున్నారు. శనివారం 500 మంది వస్తే 100 మందికే టోకెన్లు ఇచ్చారు. అన్ని గంటలు నిరీక్షించి, నీరసించినా.. ‘టీకా లేదు’ అనగానే జనాలు కోపోద్రిక్తులయ్యారు.

ప్రజల సహనానికి పరీక్ష...

* అందుబాటులో ఉన్న టీకాల మేరకు మెసేజ్‌లు వెళ్లడంలేదు. అధికారులు, క్షేత్రస్థాయి విభాగాల మధ్య సమన్వయం లేదు. దీంతో టీకా పంపిణీ పూర్తిగా గాడి తప్పింది. కచ్చితమైన సమాచారం లేక.. నగరవాసులు అధిక సంఖ్యలో ఆరోగ్య కేంద్రాలు, పంపిణీ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గంటల తరబడి వేచి ఉంటున్నారు.
* టీకా వేయించుకోవాల్సినవారు ‘కొవిన్‌’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అలా చేసుకున్నవారికీ వ్యాక్సిన్‌ ఇవ్వట్లేదు. క్యూలో ఎవరు ముందు వచ్చారో వారికే ప్రాధాన్యమిస్తున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందనే ఆరోపణలొస్తున్నాయి.
* ఆన్‌లైన్‌ స్లాట్‌లో పేర్కొన్న తేదీన ఆయా కేంద్రాలకు వెళ్తే.. ‘రాష్ట్ర ప్రభుత్వం మాకెలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు, వచ్చిన వారికి మాత్రమే వేయమనే చెప్పారు’ అని సిబ్బంది చెబుతున్నారు.
* మొదటి విడతగా టీకాలు వేయించుకున్న వారి జాబితా పూర్తిగా అధికార యంత్రాంగం దగ్గరే ఉంది. కనీసం ఆ ప్రకారం పిలిచి రెండో డోసుకు టీకాలు కేటాయించి వేసుండొచ్చు. కానీ అలా చేయడం లేదు. అసలు జాబితానే తమ వద్ద లేదని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
* టీకాల కోసం వివిధ సంస్థలు, రాజకీయ నేతల నుంచి ఆరోగ్యశాఖ అధికారులకు సిఫారసులు వెళ్తున్నాయి. క్యూలో ఉన్నవారిని కాకుండా సిఫారసుతో వచ్చిన వారికే టీకాలు వేస్తున్నారని పలుచోట్ల వాగ్వాదాలు జరుగుతున్నాయి.

సచివాలయంయూనిట్‌గా తీసుకుంటే..

కొవిడ్‌ అనుమానితులతో ఆరోగ్య కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇలాంటిచోట్లే పరీక్షలు కూడా చేస్తున్నారు. దీంతో కేంద్రాలపై తీవ్ర భారం పడుతోంది. అక్కడే టీకాలు వేయడం కష్టమవుతోందని, వచ్చిన జనాల్ని అదుపు చేయలేక పోతున్నారని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. వార్డు సచివాలయాల పరిధిలో ఎక్కడి వారికి అక్కడే టీకా వేస్తే ఇక్కట్లు తప్పుతాయని పేర్కొంటున్నారు.

ఎంతొస్తే అంతే పంపిణీ..

తమకు స్టాకు వచ్చిన దాన్ని బట్టే టీకా పంపిణీ చేస్తున్నామని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మంది జనాలు వస్తుండటంతో అదుపు చేయడం సిబ్బందికి చాలా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఎండాకాలంలో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నామని, టీకాల కొరత వస్తే తామేం చేయగలమని వాపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని