మద్యం మత్తులోనే రౌడీషీటర్‌ హత్య
Published : 09/05/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్యం మత్తులోనే రౌడీషీటర్‌ హత్య

ఐదుగురు నిందితుల అరెస్టు

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: మద్యం మత్తులో కొందరు రౌడీషీటర్‌ నీలాపు చంద్రశేఖర్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. రెండో పట్టణ సీఐ కె.వెంకటరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లిపురం ప్రాంతానికి చెందిన నీలాపు చంద్రశేఖర్‌ అలియాస్‌ ఐరన్‌మ్యాన్‌(23) తండ్రి చనిపోయాడు. తల్లి కొబ్బరిబొండాలు విక్రయిస్తుంటుంది. చంద్రశేఖర్‌ మద్యం, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. నగరంలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు.. అతనిపై రౌడీషీట్‌ కూడా ఉంది. పెయింటింగ్‌ పనులు చేసే భూపేష్‌ నగర్‌కు చెందిన రాయపాటి వెంకటరమణ (30), రోడ్లపై ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించే గుల్లా మహేష్‌ (32), నేరళ్లకోనేరుకు చెందిన ఆటోడ్రైవర్‌ షేక్‌ అన్సర్‌ బాబా(21), అచ్చియమ్మపేటకు చెందిన వాసుపల్లి చంద్రమోహన్‌ (23), నేరళ్లకోనేరుకు చెందిన ఎం.సతీష్‌కుమార్‌ (36) వ్యసనాలకు బానిసై చిన్న, చిన్న దొంగతనాలు చేస్తుంటారు. వచ్చిన డబ్బులతో  మత్తుపదార్థాలు కొనుగోలు చేసి తాగుతుంటారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వీరితో కలిసి నీలాపు చంద్రశేఖర్‌ రామకృష్ణ కూడలి నుంచి కాన్వెంట్‌ వెళ్లే మార్గంలో ఉన్న పైవంతెన కింద మద్యం, గంజాయి తాగారు.. మత్తులో ఉన్న వారంతా తీవ్రంగా దూషించుకున్నారు..ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో చంద్రశేఖర్‌పై మిగతా ఐదుగురు తమ వద్ద ఉన్న చిన్న కత్తులతో శరీరం, ముఖంపై దాడులు చేసి చంపేశారు. అనంతరం అక్కడే ఉన్న మురుగు కాలువలో తోసేసి ఎవరికీ కనిపించకుండా రాళ్లతో మృతదేహాన్ని కప్పేశారు. అక్కడ గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. హార్బర్‌, రెండోపట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.. నిందితులు ఐదుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని