వ్యాక్సిన్‌ వేసి..ప్రజల ప్రాణాలు కాపాడండి: తెదేపా
Published : 09/05/2021 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ వేసి..ప్రజల ప్రాణాలు కాపాడండి: తెదేపా

ఈనాడు, విశాఖపట్నం : ‘వ్యాక్సిన్‌ వేయాలి..ప్రజల ప్రాణాలు కాపాడాలి’ నినాదంతో తెదేపా ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖలో పార్టీ నాయకులు ఇళ్ల నుంచే నిరసనలో పాల్గొన్నారు. నల్లటి దుస్తులు ధరించి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నగర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ కింద రాష్ట్రానికి రూ.88 వేల కోట్లు అందజేసిందన్నారు. అందులో సగం నిధులు కరోనా నియంత్రణ చర్యలకు ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గత ఏడాది కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద సేవలందించిన ఆసుపత్రులకు బకాయిలు చెల్లించలేదన్నారు. పడకలు, ఆక్సిజన్‌ కోసం బాధితులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఆ ఆలోచనే చేయడం లేదన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ నగరంలో ఆక్సిజన్‌, ఐసీయూ పడకల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం వరకు ఆరోగ్యశ్రీ పడకలు కేటాయిస్తున్నట్లు చెబుతున్నా అవి ఎక్కడా కనిపించడం లేదన్నారు. 104 సేవలు కూడా సక్రమంగా అందడం లేదని విమర్శించారు.
* ఇంటి నుంచి వర్చువల్‌ విధానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా, అనుభవమున్న నేతగా చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా వివిధ మార్గాల్లో బాధితులకు సహకారం అందిస్తున్నారు. అటువంటి నాయకుడిపై అధికార పార్టీ కేసు పెట్టడాన్ని ఏమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయటకు వస్తే సీఎం జగన్‌కు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి పదవి డబ్బు సంపాదన, కక్ష సాధింపు కోసమే అన్నట్లుగా జగన్‌ తీరు ఉందని ధ్వజమెత్తారు.
* తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌, రాష్ట్ర కార్యదర్శి మూర్తి యాదవ్‌ మాట్లాడుతూ దేశంలోని 30 జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే.. అందులో ఏడు ఏపీలో ఉన్నాయన్నారు. అయినా పట్టనట్లు ఉండడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమన్నారు. ప్రజలు బాధల్లో ఉంటే ముఖ్యమంత్రి కనీసం బయటకొచ్చి మాట్లాడడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని