అస్తవ్యస్తంగా... లీజుల వ్యవస్థ
logo
Published : 18/06/2021 03:52 IST

అస్తవ్యస్తంగా... లీజుల వ్యవస్థ

మూడేళ్లు దాటితే టెండరు పిలవండి
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అధికారులు చేసిన తప్పిదాలకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తున్నారని ఇన్‌ఛార్జి మంత్రి కె.కన్నబాబు పేర్కొన్నారు. ప్లాను లేదని, నిబంధనలు అతిక్రమిస్తున్నారని తెలిసినా అధికారులు మొదట్లో స్పందించడంలేదని, వాటిపై ఫిర్యాదులు వస్తే కూల్చి వేస్తున్నారన్నారు. అధికారంతో పాటు, బాధ్యత వహించేలా వ్యవహరించాలని జీవీఎంసీ అధికారులకు ఆయన సూచించారు. జీవీఎంసీ అభివృద్ధి పనులపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఐదు గంటలపాటు  సాగిన సమావేశంలో మేయరు గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు విజయసాయిరెడ్డి, బి.వి సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్‌రాజు, కమిషనర్‌ సృజన, పలువురు అధికారులు పాల్గొన్నారు.

బీచ్‌రోడ్డు అభివృద్ధి, కోత నియంత్రణ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు త్వరగా ఇచ్చేలా చూడాలని ఎంపీ విజయసాయిరెడ్డిని కమిషనర్‌ సృజన కోరారు. బీఆర్‌టీఎస్‌ రహదారి విస్తరణ పనులు నిలిచిపోవడంపై మంత్రి ముత్తంశెట్టి అధికారులను ప్రశ్నించగా, గుత్తేదారు కోర్టుకెళ్లారని, కొన్ని గృహాల తొలగింపు చేయాలంటే ప్రత్యామ్నాయ స్థలాలివ్వాల్సి ఉండటంతో విస్తరణ ఆలస్యమైందని ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి విద్యుల్లత తెలిపారు.
అక్రమ నిర్మాణాలను అరికట్టేలా అధికారులకు బాధ్యతలు అప్పగించాలని, ఒకవేళ వారి పరిధిలో అక్రమ నిర్మాణం జరిగితే వారినే బాధ్యులుగా చేసేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలని మంత్రి అన్నారు. మేయరు గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ కొత్తగా 1,700 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరమవుతారని, ప్రభుత్వ అనుమతి కావాలని కోరారు. వార్డు కార్యదర్శుల విధులను పర్యవేక్షించేలా జెడ్సీలు బాధ్యతలు తీసుకోవాలన్నారు.

ముడసర్లోవలో గోల్ఫ్‌ మైదానానికి కేటాయించిన 100 ఎకరాలకు ఎంత మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించగా... అదనపు కమిషనర్‌ ఆశాజ్యోతి మాట్లాడుతూ గతంలో లీజుకు ఇచ్చిన 100 ఎకరాలు నెలకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని... ఆరేళ్ల క్రితం ఇచ్చిన 12 ఎకరాలకు నెలకు రూ.63 వేలుగా లీజు నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగా ఇచ్చిన 100 ఎకరాలకు లీజును మదించాలని, లేకుంటే స్థలాన్ని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. ఆదాయాన్ని పెంచుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు. లీజుల వ్యవహారమంతా అస్తవ్యస్తంగా ఉందని, మూడేళ్లు దాటిన వెంటనే తిరిగి లీజుకిచ్చేలా టెండరు పిలవాలని ఎంపీ సూచించారు. లీజులకు సంబంధించి సమగ్ర నివేదికివ్వాలని కోరారు.
జీవీఎంసీ ఆకర్షణీయ ప్రాజెక్టులపై కమిషనర్‌ పవర్‌పాయింటప్రజంటేషన్‌ ఇచ్చారు. రూ.3వేల కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఆకర్షణీయ వీధుల నిర్మాణంపై ఎంపీ ఎంవీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశాల్లోలా రహదారులను చిన్నవిగా చేయడం సరికాదన్నారు. పురాతన భవనాలను  మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని, బొబ్బిలి, విజయనగరం రాజుల వైభవం, విశాఖ వైభవంపై అవగాహన కలిగేలా రూపొందించాలన్నారు. ఏషియన్‌ డెవలప్‌మెం  బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులను కమిషనర్‌ వివరించారు. నగరంలో 1,289 ఖాళీ స్థలాలున్నాయని, వాటిని పరిరక్షించి పార్కుల్లా అభివృద్ధి చేస్తామన్నారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతం 850 ఎకరాలుందని, ఆయా స్థలాల్లో అంతర్జాతీయ పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులతోనే పార్కును అభివృద్ధి చేయాలని, ప్రయివేటువారిని అనుమతించవద్దని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని