ప్రజాసమస్యలపై వాణి వినిపించాం
logo
Published : 18/06/2021 03:52 IST

ప్రజాసమస్యలపై వాణి వినిపించాం

ఎమ్మెల్సీలు బుద్ద, పప్పల వెల్లడి

నేటితో ఇద్దరి పదవీ కాలం ముగింపు

అనకాపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీల పదవీ కాలం శుక్రవారంతో ముగియనుంది. ఎలమంచిలికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకుడు పప్పల చలపతిరావు, అనకాపల్లికి చెందిన బుద్ద నాగజగదీశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో మండలి సభ్యులుగా నియమితులయ్యారు. చలపతిరావు 2015లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరేళ్లపాటు పదవిలో ఉన్నారు. బుద్దకు సైతం స్థానిక సంస్థల కోటాలోనే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అప్పటివరకూ ఈ పదవిలో ఉన్న మూర్తి మరణంతో ఏర్పడిన ఖాళీని ఈయనతో భర్తీ చేశారు. 2019లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.  తమ పదవీ కాలంలో నిర్వర్తించిన బాధ్యతలపై ఇద్దరు ఎమ్మెల్సీలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వాణిని గట్టిగా వినిపించామన్నారు.

ఆ బిల్లుపై నిలదీశా
ఎమ్మెల్సీగా పని చేసింది తక్కువకాలమే అయినా పార్టీ వాణిని శాసనమండలిలో గట్టిగా వినిపించా. మూడు రాజధానుల బిల్లుపై నిలదీశాను. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించినా పాల్గొన్నా. కార్యకర్తలకు అండగా నిలిచాను. తెదేపాకి చేసిన సేవలను గుర్తించి అధినేత నారా చంద్రబాబు నాయుడు నాకు శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవినీ ఇచ్చారు’ అని బుద్ద నాగజదీశ్వరరావు పేర్కొన్నారు.

ఎంతో సంతృప్తినిచ్చింది
ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్సీగా ఒకసారి పని   చేశాను. ఎమ్మెల్సీ పదవి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. దేశంలో నాలుగు చట్టసభలు ఉండగా... అందులో రాజ్యసభకు తప్ప మిగిలిన అన్ని సభలకు ఎన్నికయ్యానన్న ఆనందం నాలో ఉంది. గతంలో  తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా చేశాను.   దేవుడికి సేవచేసే అదృష్టం కొందరికే ఉంటుంది. అది నాకు దక్కింది. తెదేపా అధినేత చంద్రబాబు నాకు ఎంతో గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చారు. అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను ఎత్తిచూపాను. రాజకీయాల్లో ఉన్నంత కాలం తెదేపాలో ఉంటాను’ అని పప్పల చలపతిరావు పేర్కొనారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని