జీతాలు చెల్లించాలంటూ ‘గోవాడ’లో విధుల బహిష్కరణ
logo
Published : 18/06/2021 03:51 IST

జీతాలు చెల్లించాలంటూ ‘గోవాడ’లో విధుల బహిష్కరణ

కర్మాగారంలో నినాదాలు చేస్తున్న కార్మికులు

చోడవరం, న్యూస్‌టుడే: గోవాడ చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు గురువారం విధులు బహిష్కరించి ధర్నా చేశారు. కర్మాగారంలో గుర్తింపు యూనియన్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ ధర్నాలో కార్మికులంతా పాల్గొన్నారు. జీతాలు చెల్లించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. తొలుత కార్మికులంతా గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు రావి సూరిబాబు అధ్యక్షతన సమావేశమయ్యారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శరగడం రామునాయుడు మాట్లాడుతూ యాజమాన్య వైఖరిపై మండిపడ్డారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదు. లీవ్‌ శాలరీ, గ్రాట్యుటీ వంటి ఆర్థిక పరమైన అంశాలను యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. కరోనా సమయంలో కూడా విధులకు హాజరయ్యామన్నారు. ఈ సమయంలో ఎండీ వి.సన్యాసినాయుడు వివిధ విభాగాధిపతులతో కలిసి కార్మికుల వద్దకు వచ్చారు. చక్కెర, మొలాసిస్‌ ధరలు పతనమైన విషయాన్ని గుర్తు చేశారు. ఆప్కాబ్‌ నుంచి రుణం వచ్చే పరిస్థితి లేదన్నారు. త్వరలో చక్కెర ఎగుమతులకు అనుమతి వస్తుందని, దాని ద్వారా వచ్చే నగదుతో జీతాలు చెల్లించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. జులై వరకు వేచి ఉండాలని కార్మికులను కోరారు. ఎండీ హామీతో ఇదే చివరి గడువు అంటూ కార్మికులు తమ ధర్నాను ముగించి విధులకు హాజరయ్యారు. కార్మిక సంఘం ప్రతినిధులు జామిశెట్టి శ్రీను, ప్రగడ నాయుడు, ప్రకాష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని