పెళ్లింట విషాదం
logo
Published : 22/06/2021 04:43 IST

పెళ్లింట విషాదం

ట్రాక్టరు బోల్తా పడి వరుడి దుర్మరణం


ట్రాక్టరు కింద పొదలం మృతదేహం

చింతపల్లి, న్యూస్‌టుడే: రెండు రోజుల్లో పెళ్లి. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పొలం దున్నేందుకు వెళ్లిన వరుడు ట్రాక్టరు బోల్తా పడటంతో దాని కింద పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. కొత్తపాలెం పంచాయతీ మాలివీధికి చెందిన కిలో కృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పొదలం (22)కు అరకు ప్రాంతానికి చెందిన యువతితో కొద్ది నెలల కిందట వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ నిబంధనలను సడలించడంతో ఈ నెల 23న వివాహం జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి పనులతో ఇల్లంతా సందడిగా ఉన్న సమయంలో పొదలం తన చిన్నాన్న ట్రాక్టరుతో పొలంలో దుక్కి వేసేందుకు బయలుదేరి వెళ్లాడు. పొలం గట్టు ఎక్కిస్తుండగా ట్రాక్టరు అదుపు తప్పి బోల్తాపడింది. చక్రం కిందపడి నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికొడుకుగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ ఇంట విషాదం అలముకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం జి.మాడుగుల పోలీస్‌ స్టేషను పరిధిలోకి రావడంతో కుటుంబ సభ్యులు అక్కడ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పొదలం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు.


బావిలో పడి మహిళ మృతి


లొలిత మృతదేహం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: కించుమండలో మతిస్థిమితం సరిగా లేని మహిళ బావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కితలంగి గ్రామానికి చెందిన కొర్రా లొలిత (55) కొద్ది నెలలుగా మతిస్థిమితం కోల్పోయి గ్రామాల వెంట తిరుగుతోంది. ఆదివారం రాత్రి కించుమండ చేరుకున్న ఆమె సోమవారం ఉదయం బావిలో శవమై తేలింది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని