అరకు అద్దాల కోచ్‌లు తరలిపోయాయ్‌!
eenadu telugu news
Updated : 25/07/2021 11:37 IST

అరకు అద్దాల కోచ్‌లు తరలిపోయాయ్‌!

 వచ్చిన రెండింటినీ ముంబయి తరలించిన వైనం
విశాఖ పర్యాటకానికి పెద్ద దెబ్బ

వాల్తేరు రైల్వే డివిజన్‌ అంటేనే చిన్నచూపు అయిపోయింది. న్యాయంగా విశాఖకు దక్కాల్సిన కోచ్‌ల్ని తరచూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తూర్పుకోస్తా రైల్వే.. ఈసారి విశాఖ-అరకు మధ్య రావాల్సిన రెండు విస్టాడోమ్‌ కోచ్‌ల్ని, తీసుకున్నట్టే తీసుకుని.. ఆ తర్వాత ముంబయికి తరలించేందుకు దగ్గరుండి సహకరించింది. వీటికి సంబంధించిన కొన్ని ఆధారాలు ‘ఈనాడు’కు దక్కాయి.  

-ఈనాడు, విశాఖపట్నం

మొదటి కోచ్‌..: గత నెలలో ముంబయి సీఎస్‌ఎంటీ-పుణె రైలు (01007/08)కు విస్టాడోమ్‌ (అద్దాల) కోచ్‌లను ప్రారంభించారు. ఇందులో ఒకటి విశాఖ నుంచి తరలివెళ్లింది. ‘204708’ నంబరుతో రిజిష్టర్‌ అయిన అద్దాల కోచ్‌ విశాఖకు వచ్చాక కోచింగ్‌ డిపోలో ఉంచి అక్కడినుంచి ముంబయికి తరలించారు.

రెండో కోచ్‌..: వారం రోజుల క్రితం మరో విస్టాడోమ్‌ కోచ్‌ విశాఖకు వచ్చింది. ఇది ‘204709’ నంబరుతో రిజిష్టర్‌ అయ్యింది. విశాఖకే కేటాయించినట్లు రికార్డుల్లో ఉంది. కానీ దీన్ని కూడా ముంబయికి తరలించాలని ఆదేశాలు రావడంతో వాల్తేరు అధికారులు వెంటవెంటనే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కోచ్‌ను అక్కడి సెంట్రల్‌ రైల్వే అధికారులు ఇంకా వినియోగించలేదు. త్వరలో ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ముంబయి-పుణె మధ్య ప్రస్తుతం తిరుగుతున్న విస్టాడోమ్‌ కోచ్‌ ఇది. ఈ కోచ్‌ మీద ‘తూర్పుకోస్తా (ఈకో)’ అని రాసి ఉంటుంది. అంటే.. తూర్పుకోస్తా రైల్వేకి చెందిందన్నమాట. ఈ జోన్‌లో ఒక్క విశాఖ-అరకు మార్గంలో తప్పితే మరెక్కడా ఈ కోచ్‌ వినియోగానికి ప్రతిపాదనలు లేవు.


ఆధునికంగా తయారుచేసిన విస్టాడోమ్‌ కోచ్‌ లోపలి భాగం

విశాఖ-అరకు మార్గంలో 5 విస్టాడోమ్‌ కోచ్‌లతో ప్రత్యేక పర్యాటక రైలు నడపాలనే ప్రతిపాదన 2016 నుంచే ఉంది. అప్పటినుంచి తయారైన కోచ్‌లను విశాఖకు కేటాయించాల్సి ఉన్నా.. కేవలం ఒక్క కోచ్‌ మాత్రమే ఇచ్చి, మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంచుతూనే ఉన్నారు. విశాఖకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారని గతం నుంచీ తూర్పుకోస్తా రైల్వే అధికారులు చెబుతూ వస్తున్నారు. 2019 సెప్టెంబరులో విశాఖ వచ్చిన అప్పటి రైల్వే సహాయమంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడీ ‘విశాఖకు త్వరలో కోచ్‌లు వస్తున్నాయి’ అని కూడా ప్రకటించారు. కానీ ఇక్కడి ప్రజాప్రతినిధులు, తూర్పుకోస్తా అధికారులు విశాఖ-అరకు పర్యాటక రైలుపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో కోచ్‌లు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నాయి.

ఏప్రిల్‌లోనే రావాల్సి ఉన్నా..: చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌కే 4 అదనపు అద్దాల కోచ్‌లు వస్తాయని, ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వచ్చిందని అప్పట్లో వాల్తేరు అధికారులకు సైతం సమాచారం వచ్చింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. న్యాయంగా విశాఖకు దక్కాల్సిన 204708, 204709 రిజిష్టర్డ్‌ కోచ్‌లు కూడా రైల్వేబోర్డు స్థాయిలో చక్రం తిప్పి మహారాష్ట్ర యంత్రాంగం తీసుకెళ్లినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు కోచ్‌లు కూడా ముందుగా విశాఖకు వచ్చాయి. వాటిని ముంబయి తరలించేందుకు అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు. కానీ ఇదేంటని భువనేశ్వర్‌లోని తూర్పుకోస్తా అధికారుల్ని ప్రశ్నించినప్పుడు.. ‘తూర్పుకోస్తా రైల్వేకు అద్దాల కోచ్‌లు కేటాయించినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదు’ అని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.

త్వరలో ఇంకో రెండు..: ప్రతిపాదించిన 4 అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ల్లో ప్రస్తుతం రెండింటిని విశాఖ నుంచి తరలించేశారు. మరో రెండు కోచ్‌లు విశాఖ నుంచి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వీటిని కాపాడుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు సందేహంగా ఉంది.
* ప్రస్తుతం విశాఖ-అరకు మధ్య నడుస్తున్న ఒక్క కోచ్‌ కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈనేపథ్యంలో అదనపు కోచ్‌లు పెడితే మంచి డిమాండ్‌ ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు వాల్తేరు అధికారులు మాత్రం.. ‘అరకు మార్గంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ల్ని ఏర్పాటు చేయవచ్చు’ అంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని