ఫోర్జరీ సంతకాలతో జీతాలు
eenadu telugu news
Published : 31/07/2021 03:01 IST

ఫోర్జరీ సంతకాలతో జీతాలు

ఐటీడీఏలో డ్వామా సిబ్బంది ఘనకార్యం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పాడేరు: జిల్లా జలయాజమాన్య సంస్థ (డ్వామా)కు చెందిన ఇద్దరు ఉద్యోగులు విధులకు సక్రమంగా వెళ్లకుండా ఫోర్జరీ సంతకాలతో జీతాలు పొందుతున్న వైనం వెలుగుచూసింది. పాడేరు ఐటీడీఏ పీవోకి సీసీగా పనిచేస్తున్నట్లు చెప్పుకొంటున్న సందీప్‌ రాజా, పీవో కార్యాలయంలోనే సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న కె.రామచంద్రరావు ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ లేఖ రాసినట్లు తెలిసింది. జూన్‌ 21 నుంచి జులై 20 వరకు జీతాల కోసం వీరు సమర్పించిన డ్యూటీ సర్టిఫికెట్లలో ఉన్నతాధికారుల సంతకాలను వీరే ఫోర్జరీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నెలకు సంబంధించిన ధ్రువపత్రాలే కాకుండా గతంలో కూడా వీరు సమర్పించిన విధి నిర్వహణ పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

సందీప్‌రాజా అరకు క్లస్టర్‌లో గత అయిదేళ్లుగా సాంకేతిక సహాయకుడిగా (టీఏ) పనిచేస్తున్నారు. కొంతకాలం ఐటీడీఏ పీవో సీసీగా పనిచేశారు. అతని ప్రవర్తన బాగోలేకపోవడంతో తరువాత మాతృశాఖకు పంపిచేశారు. ఆ తరువాత విధులకు ఎగనామం పెట్టేసినా క్రమం తప్పకుండా విధి నిర్వహణ ధ్రువపత్రాలను సమర్పించేవారు. జూన్‌ నుంచి జులై 20 వరకు పనిచేసినట్లు ఇచ్చిన ధ్రువపత్రంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే పాడేరు ఎమ్‌సీసీ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కె.రామచంద్రరావు ఐటీడీఏ పీవో కార్యాలయంలో ఇదివరకు డిప్యుటేషన్‌పై నియమించారు. అయితే ఎప్పుడూ కూడా కార్యాలయంలో ఇతను పనిచేసింది లేదు. ఇతను విధులకు ఎప్పుడూ ఎగనామం పెడుతుండేవారు. ఇతని సేవలు కూడా మాకొద్దని ఇదివరకే పంపించేశారు. కాని పీవో కార్యాలయంలోనే పనిచేస్తున్నట్లు డ్యూటీ సర్టిఫికెట్లు సమర్పించి జీతాలు పొందుతున్నట్లు ఇటీవల కొత్తగా వచ్చిన పీవో దృష్టికి వచ్చింది. దీంతో ఆయన వీరి వ్యవహారశైలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై డ్వామా పీడీ సందీప్‌ వద్ద ప్రస్తావించగా వారిపై పీవో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం నిజమేనన్నారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి వారికి సంబంధించిన దస్త్రం వచ్చిన తరువాత విచారణ చేసి ఆ ఇద్దరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని