మధ్యతరగతికి మూడు రకాల ప్లాట్లు
eenadu telugu news
Published : 31/07/2021 03:01 IST

మధ్యతరగతికి మూడు రకాల ప్లాట్లు

తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు

జేసీ వేణుగోపాలరెడ్డి

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లే మధ్యతరగతి కుటుంబాలకు కూడా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పేరుతో మూడు రకాల ప్లాట్లను అందజేయనున్నట్లు సంయుక్త కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో విలేకర్లతో మాట్లాడారు. వచ్చే ఉగాది నాటికి మధ్యతరగతి వారికి స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మరికొన్ని వివరాలు ఆయన మాటల్లోనే ..

ప్రైవేటు లేఅవుట్లలో స్థలాలు కొనాలంటే చాలా ఎక్కువ రేటు పెట్టాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వమే లేఅవుట్‌ అభివృద్ధి చేసి నామమాత్రపు రేట్లకు అందించడం వల్ల కొనుగోలుదారులకు ఆర్థిక భారం తగ్గుతుంది. దీంతో పాటు హక్కులు వెంటనే సొంతమవుతాయి. నగరానికి సమీపంలో ప్రైవేటు లేఅవుట్లకు దగ్గరలోనే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆనందపురంలో ఇప్పటికే మూడు చోట్ల స్థలాలు గుర్తించాం. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి అనుకుని పెందుర్తి, సబ్బవరం వంటి చోట్ల లేఅవుట్లు వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. భీమిలి, భోగాపురం ప్రాంతాల మధ్య ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండడంతో అక్కడ కూడా టౌన్‌షిప్పులను నిర్మించాలని చూస్తున్నాం.

భూ సమీకరణ ద్వారానే..

జీవీఎంసీ ద్వారా మధ్యతరగతి ఇళ్ల స్థలాల కోసం నమూనా సర్వే జరిపించాం. సుమారు 40 వేల మంది వీటి కోసం ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఈ లేఅవుట్లు కార్యరూపంలోకి వచ్చేనాటికి వీరి సంఖ్య ఇంకా పెరగొచ్ఛు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఈ టౌన్‌షిప్పుల కోసం సుమారు మూడు వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నాం. ఎక్కువగా ప్రభుత్వ భూములనే పరిశీలిస్తున్నాం. అవిలేకుంటే జిరాయితీ భూములను భూ సమీకరణ ద్వారా సేకరించాలని ఆలోచన చేస్తున్నాం. జగనన్న కాలనీలకు 6 వేల ఎకరాలు భూ సమీకరణ ద్వారానే ఇచ్చారు. ఈ టౌన్‌షిప్పులకు కూడా అలాంటి స్పందనే వస్తుందని ఆశిస్తున్నాం. లేఅవుట్‌ అభివృద్ధి చేసిన తరువాత భూ యజమానికి 900 గజాల స్థలం ఇవ్వనున్నార. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

60 అడుగుల వెడల్పు రోడ్లు, భూగర్భ మురుగు పారుదల కాలువల వ్యవస్థ, ఫైబర్‌ నెట్‌ సదుపాయం కల్పిస్తూ 150, 200, 240 గజాల చొప్పున ప్లాట్లను అందుబాటులోకి తెస్తాం. వీటికి అక్కడ భూముల కొనుగోలు, లేఅవుట్‌ అభివృద్ధికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రేట్లు నిర్ణయిస్తారు.

మొదటిగా రెండు మూడు లేఅవుట్లను అభివృద్ధి చేసిన తరువాత స్పందన చూసి మిగతా వాటిపై దృష్టిసారిస్తాం. సహజంగానే ప్రైవేటు లేఅవుట్‌ కంటే తక్కువ రేటుకే ఈ ప్లాట్లను అందిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని