అసలేం జరుగుతోందక్కడ?
eenadu telugu news
Updated : 31/07/2021 03:03 IST

అసలేం జరుగుతోందక్కడ?

బమిడికలొద్ది క్వారీపై ఎన్జీటీలో ఫిర్యాదు

ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు

ఎట్టకేలకు లేటరైట్‌ తవ్వకాలకు బ్రేక్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

లేటరైట్‌ క్వారీ ప్రాంతం

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దునున్న వివాదాస్పద బమిడికలొద్ది లేటరైట్‌ క్వారీకి మరోసారి బ్రేక్‌ పడింది. మైనింగ్‌ పేరుతో వేలాది చెట్లను నేలకూల్చారని, అటవీ శాఖ అనుమతులు లేకుండానే భారీఎత్తున రోడ్డు నిర్మించారని, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నారని నాతవరం మండలం గునిపూడికి చెందిన దళిత ప్రగతి ఐక్యసంఘం జిల్లా అధ్యక్షుడు కోండ్రు మరిడియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో ఇదివరకే పిటీషన్‌ దాఖలు చేశారు.

తాజాగా ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం మైనింగ్‌ అక్రమాలపై ప్రాథమిక విచారణ ముగించింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు కేంద్ర అటవీ, రాష్ట్ర గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్‌తో సంయుక్త కమిటీని వేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో లేటరైట్‌ తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. నిర్వాహకుల్లో గుబులు పట్టుకుంది.

బమిడికలొద్ది పరిధిలోని 121 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాల కోసం 2009లో కొయ్యూరు మండలానికి చెందిన జర్తా లక్ష్మణరావు దరఖాస్తు చేశారు. అప్పట్లో అతను గిరిజనుడు కాదని, గ్రామసభ తీర్మానం బోగస్‌ది పెట్టారని ఫిర్యాదులు చేయడంతో పాటు స్థానికులు కోర్టులను ఆశ్రయించారు.

పీసా ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఏ అనుమతి కావాలన్నా గ్రామసభ తీర్మానం ముఖ్యమని అదిలేకుండానే తవ్వకాలకు సిద్ధమవుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఇలా విచారణలు, కోర్టులను దాటుకుంటూ 2018లో లీజుదారునికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తరువాత కూడా లేటరైట్‌ తవ్వకాలకు స్థానికులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం మారిన తరువాత అధికార పార్టీ నేతల సహకారంతో చకచకా ఏర్పాట్లు చేసుకున్నారు. కోర్టు కూడా ధిక్కరణ కేసుగా పరిగణించి లీజుదారునికి అనుమతులివ్వాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి క్వారీలో తవ్వకాలకు, తవ్విన లేటరైట్‌ను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.

అన్నీ ఉల్లంఘనలే..

లేటరైట్‌ తవ్వకాల పేరుతో విలువైన బాక్సైట్‌ తరలించుకుపోవడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. దీనికోసమే 250 కుటుంబాలున్న గ్రామానికి 30 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించారు. చెట్లను నేలకూల్చారు. ఖనిజాలను తరలించుకుపోతున్నారు. 250 ఎకరాల్లో తవ్వకాలు చేపడితే పర్యావరణానికి పెద్దముప్ఫే ఆ వాహనాల దుమ్ము, ధూళి కారణంగా చర్మవ్యాధులు వస్తాయి. వన్యప్రాణులు ఉనికి కోల్పోతాయి. దీనిపై ఎన్జీటీలో కేసు వేశాను. గిరిజనులకు అండగా పోరాడతాను.

- కోండ్రు మరిడియ్య, దళిత ప్రగతి ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు

మైనింగ్‌ వ్యవహారంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ ఇటీవల పర్యటించింది. ఆ వివరాలను వెల్లడించకుండానే నేతలను అరెస్టు చేశారు. అప్పటికి సుమారు 11 వేల మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌ను తవ్వి తరలించారు. ఈలోగా వర్షాలు కురవడంతో తవ్వకాలను నిలిపారు. తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కూడా ఈ మైనింగ్‌ పరిశీలనకు కమిటీ వేయడంతో ఇప్పట్లో తవ్వకాలకు బ్రేక్‌ పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని