ప్రవాసాంధ్రుల్లో పెరుగుతున్న సేవానిరతి: విప్‌
eenadu telugu news
Published : 31/07/2021 03:03 IST

ప్రవాసాంధ్రుల్లో పెరుగుతున్న సేవానిరతి: విప్‌

ఘాట్‌ రోడ్డు కూడలిలో గోతులు చూస్తున్న విప్‌

మాడుగుల, న్యూస్‌టుడే: ప్రవాసాంధ్రుల్లో సేవా భావం పెరుగుతోందని, ఇతర దేశాలకు వెళ్లి వ్యాపారవేత్తలుగా, ఉద్యోగాల్లో సిర్థపడినవారు జన్మభూమికి సేవచేయాలన్న తలంపుతో ముందుకు రావడం హర్షణీయమని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడిన మాడుగులకు చెందిన పాలకుర్తి అచ్యుతరాజు కుమారుడు నగేష్‌ కుమార్‌ విశాఖకు చెందిన వైద్యుడు చైతన్య ద్వారా పంపించిన రూ.7.50 లక్షల విలువచేసే ఆరు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 50 పల్స్‌ ఆక్సీ మీటర్లను విప్‌ శుక్రవారం మాడుగుల, కేజేపురం ఆసుపత్రులకు వైద్యులు సూర్యప్రకాశరావు, ఈశ్వర ప్రసాద్‌లకు అందచేశారు. శిథిలమైన మాడుగుల రహదారుల భవనాల శాఖకు చెందిన విశ్రాంత బంగ్లాను పూర్తిగా తొలగించాలని, ప్రహరీకి మరమ్మతులు చేపట్టాలని డీఈఈ వేణుగోపాల్‌కు విప్‌ ముత్యాలనాయుడు సూచించారు. రహదారులు భవనాల శాఖ సిబ్బందితో కలిసి ఈ బంగ్లాను పరిశీలించారు. చోడవరం రహదారిలో అగ్నిమాపక కార్యాలయం వద్ద, ఘాట్‌ రోడ్డు కూడలిలో గుంతలు పూడ్చాలని చెప్పారు. ఎంపీడీఓ పోలినాయుడు, మాడుగుల సర్పంచి, ఉపసర్పంచులు యడ్ల కళావతి, శ్రీనాథు శ్రీనివాసరావు, వైకాపా నేతలు వేమవరపు రామధర్మజ, బొమ్మిసెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పదిలోగా రైవాడ నీరు విడుదల

దేేవరాపల్లి, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ వరి నాట్లు వేసుకోవడానికి రైవాడ ఆయకట్టు రైతులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నదాతలను కోరారు. జలాశయం నుంచి నీటి విడుదలపై కలెక్టర్‌తో పాటు జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో త్వరలో చర్చిస్తానన్నారు. ఆగస్టు 10వ తేదీ లోగా మంచిరోజు చూసుకుని నీటిని విడుదల చేస్తామన్నారు. వైకాపా నాయకులు, రైతులతో కలిసి రైవాడ జలాశయాన్ని సందర్శించారు. జలాశయంలో నీటి నిల్వలపై అధికారులను ఫోనులో అడిగి తెలుసుకున్నారు. వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డా.సింహాచలం నాయుడు, దేవరాపల్లి ఉప సర్పంచి కిలపర్తి భాస్కరరావు, వైకాపా నాయకులు కర్రి సత్యం, చల్లా తాతయ్యల తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికి సీఎం కృషి

చీడికాడ, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తునివలసలోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు పవర్‌ టిల్లర్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై.. నలుగురు రైతులకు పవర్‌ టిల్లర్లను అందజేశారు. తునివలస సర్పంచి పడాల హైమా, వైకాపా నేతలు గొల్లవిల్లి రాజబాబు, యర్రా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన 108 ఏళ్ల వృద్ధురాలు గుటాల పైడితల్లిమ్మను ముత్యాలనాయుడు సన్మానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని