ద్వితీయ ఉప మేయరుగా కటుమూరి సతీష్‌
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

ద్వితీయ ఉప మేయరుగా కటుమూరి సతీష్‌

సజావుగా ఎన్నిక ప్రక్రియ
సతీష్‌ను అభినందిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, మేయరు గొలగాని, ఎమ్మెల్యేలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ ద్వితీయ ఉప మేయరు ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది. పోటీ లేకపోవడంతో వైకాపా అధిష్ఠానం ప్రతిపాదించిన కటుమూరి సతీష్‌ ద్వితీయ ఉప మేయరుగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ మల్లికార్జున ప్రకటించారు. శుక్రవారం ఉదయం 10.55 గంటలకు కౌన్సిల్‌ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి వైకాపా కార్పొరేటర్లు హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రత్యేకాధికారి హోదాలో మేయరు సీట్లో కూర్చున్నారు. సతీష్‌ పేరును జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు ప్రతిపాదించారు. దానికి మిగతా కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. దీంతో ద్వితీయ ఉప మేయరుగా సతీష్‌ ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

* ఉదయం 11.05 గంటలకు తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, ఇతర కార్పొరేటర్లు సమావేశ మందిరానికి వచ్చారు. అప్పటికే ఎన్నిక పూర్తి కావడంతో ద్వితీయ ఉప మేయరు సతీష్‌ను అభినందించారు. కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయరు గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్‌, గుడివాడ అమర్‌నాథ్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, సీపీఎం, సీపీఐ, జనసేన కార్పొరేటర్లు గంగారావు, ఏజే స్టాలిన్‌, పీతల మూర్తియాదవ్‌; వైకాపాకు మద్దతు ప్రకటించిన తెదేపా కార్పొరేటర్లు కాకి గోవిందరెడ్డి, లేళ్ల కోటేశ్వరరావు హాజరయ్యారు.

* ఎన్నిక అనంతరం మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడుతూ దళితుల ఓట్లు మాత్రమే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు కావాలని, వారి అభివృద్ధి అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు దళిత కార్పొరేటరును ద్వితీయ ఉప మేయరుగా ఎన్నుకున్న కార్యక్రమానికి తెదేపా కార్పొరేటర్లు గైర్హాజరయ్యారన్నారు. సతీష్‌ మాట్లాడుతూ విశాఖ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం వైకాపా కార్యకర్తలు గజమాల వేసి సత్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని