ప్రత్యామ్నాయం కనపడక..
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

ప్రత్యామ్నాయం కనపడక..

●‘నాడు-నేడు’కు భవనాలు ఖాళీ చేయాలని తాఖీదు

కేజీహెచ్‌, ఏఎంసీ వర్గాలు తర్జనభర్జన

కేజీహెచ్‌ ఆవరణలో ఉన్న ప్రసూతి భవనం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : కేజీహెచ్‌, ఆంధ్ర వైద్య కళాశాల ఆవరణలో ‘నాడు-నేడు’ పథకం కింద అయిదు బ్లాకుల నిర్మాణం చేపట్టడానికి ఎంపిక చేసిన భవనాలను అప్పగించాలని ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ) వైద్యాధికారులకు తాఖీదులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా భవనాలను ఖాళీ చేస్తే పనులు ప్రారంభిస్తామని సంస్థ చీఫ్‌ ఇంజినీరు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కళాశాల/ఆసుపత్రి వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. హఠాత్తుగా భవనాలను ఖాళీ చేసి వెళ్లమంటే ఎలా అని మధన పడుతున్నారు. భవనాల్లో ఉన్న పడకలను ఎక్కడికి తరలించాలో పాలుపోని పరిస్థితి

* కేజీహెచ్‌లో ప్రసూతి, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, ఎముకలు, సర్జరీ, క్యాన్సర్‌ వార్డులు కొనసాగుతున్న భవనాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు బ్లాకులు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆంధ్ర వైద్యకళాశాల పరిపాలన భవనం, బయో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాలు కొనసాగుతున్న భవనాన్ని తొలగించి కొత్తగా బ్లాక్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు వసతిగృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఆరు బ్లాకుల నిర్మాణానికి రూ.600కోట్లు ఖర్చు కానున్నది. ప్రస్తుతం ఉన్న పాత భవనాల్లో దాదాపు 600 పడకలు ఉన్నాయి. వీటిని ఎక్కడికి మార్చాలో అధికారులకు తెలియడం లేదు.

* సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 500 పడకలు ఉన్నాయి. అందులో కొవిడ్‌ వార్డు కొనసాగుతోంది. మూడో దశ కరోనా అంచనాల నేపథ్యంలో ఆ బ్లాక్‌ను ఇతర వార్డులకు కేటాయించే పరిస్థితి లేదు. విమ్స్‌కు పడకలను తరలించడం కష్టసాధ్యమే. అక్కడా కొవిడ్‌ వార్డు కొనసాగుతోంది. వైద్యకళాశాల పరిపాలన భవనంలో ఉన్న నాలుగు విభాగాలను ఎక్కడికి తరలించాలో అర్థం కావడం లేదు. ఆయా భవనాల్లో ప్రయోగశాలలతోపాటు లెక్చర్‌ హాళ్లు ఉన్నాయి.

* భవనాలను ఖాళీ చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి ఒత్తిడి వస్తుండడంతో వైద్యాధికారులకు పాలుపోవడం లేదు. ఇటీవల ఆయా అంశాలను వైద్య విద్యాశాఖ సంచాలకులు (డీఎంఈ) దృష్టికి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ తీసుకెళ్లారు. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నందున ఇప్పుడిప్పుడే భవనాలను ఖాళీ చేయలేమని, ప్రత్యామ్నాయం చూపాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని