మంత్రి ముత్తంశెట్టి ఎదుట వైకాపా కార్పొరేటర్ల మొర
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

మంత్రి ముత్తంశెట్టి ఎదుట వైకాపా కార్పొరేటర్ల మొర

పనుల్లేవ్‌.. విలువ లేదు..!

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మాకు క్షేత్రస్థాయిలో అధికారులు కనీస విలువ ఇవ్వడం లేదు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించిన పనులు ఒక్కటి కూడా కౌన్సిల్‌ అజెండాల్లో పెట్టడం లేదు. ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియడం లేదని పలువురు వైకాపా కార్పొరేటర్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎదుట వాపోయారు. జీవీఎంసీ ద్వితీయ ఉప మేయరును ఎన్నుకోవడానికి ముందు మంత్రి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నగరంలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు తమ గోడు చెప్పుకున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం... 12వ వార్డు పరిధిలోని చిన్న నిర్మాణాలను కూడా అక్రమం పేరిట తొలగిస్తున్నారు. ప్రణాళికాధికారులకు చెప్పినా తమ మాట వినడంలేదని కొందరు ఫిర్యాదు చేశారు. ప్లానుకు విరుద్ధంగా చేపడుతున్న భారీ నిర్మాణాలను వదిలేసి పేదలు ఇళ్లను పడగొట్టడం సరికాదన్నారు. 60వ వార్డులోని కొండవాలు ప్రాంతానికి పారిశుద్ధ్య కార్మికులెవరూ రావడం లేదు. అయినా అక్కడి నివాసితులకు చెత్త సేకరణ రుసుములు చెల్లించాలని సంక్షిప్త సమాచారం పంపిస్తున్నారు. మురికివాడల్లో పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదు. అధికారుల పనితీరు సరిగా లేదని వివరించారు. 16వ వార్డులో స్థానికంగా ఉన్న అధికారులు ఎవరూ తమకు విలువ ఇవ్వడం లేదన్నారు. మాట వినకపోవడంతోపాటు వార్డులోని సమస్యలను పరిష్కరించడం లేదని వాపోయారు. 54వ వార్డులో తమ ప్రాంత పర్యటనకు వచ్చిన అధికారులు ఓ మందిరాన్ని పడగొట్టించారని వాపోయారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, ద్వితీయ ఉప మేయరు గెలిచేలా అందరూ సహకరించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని