Vizag: ఇక ఏటా ఆస్తి పన్ను బాదుడు
eenadu telugu news
Updated : 08/08/2021 11:08 IST

Vizag: ఇక ఏటా ఆస్తి పన్ను బాదుడు

నూతన విధానానికి కౌన్సిల్‌ ఆమోదం

నివాసాలకు 0.12శాతం ఖరారు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

మేయరు గొలగాని హరి వెంకట కుమారి

నగరంలో ఇక ఏటా ఆస్తి పన్ను పెరుగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య మూల విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానానికి శనివారం జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధర పెంచిన ప్రతిసారి ఆస్తి పన్ను కూడా పెరుగుతూ ఉంటుంది. తొలుత మూల విలువలో గృహాలకు 0.15 శాతం ప్రతిపాదించగా.. దాన్ని 0.12శాతంగా ఖరారు చేశారు. వాణిజ్య సముదాయాలకు 0.30శాతం, ఖాళీ స్థలాలకు 0.50శాతం విధించనున్నారు.

* తొలుత ఆస్తుల కొలతల ప్రకారం 0.12శాతం పన్ను లెక్కిస్తారు. ప్రస్తుత పన్ను దానికంటే ఎక్కువ ఉంటే.. 15 శాతం మొదటి ఏడాది పెంచుతారు. తరువాత ఏడాది మరో 15శాతం ఇలా మూలధన విలువలో 0.12శాతానికి చేరేంత వరకు పన్ను పెరుగుతుంటుంది. ఒక వేళ ప్రభుత్వం భూముల విలువ పెంచితే మళ్లీ మూలధన విలువ వృద్ధి చెంది ఆస్తి పన్ను మరితం పెరిగే అవకాశం ఉంది. దానిని చేరుకునే వరకూ ప్రతి ఏడాది 15 శాతం చొప్పున పెంచుతారు.

కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న తెదేపా, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు, నేతలు

* సమావేశం ప్రారంభమైన అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు వీవీ రామారావు, నమ్మి పైడిరాజులకు సభ్యులు నివాళులర్పించారు. ఉప కమిషనర్‌ (రెవెన్యూ) నల్లనయ్య పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా నూతన ఆస్తి పన్ను విధానాన్ని వివరించారు.


తోపులాటలు... అరెస్టులు

ఆందోళన కారులను అరెస్టు చేస్తున్న పోలీసులు

మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నుపై ప్రతిపక్షాలు శనివారం భారీ ఎత్తున ఆందోళన చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేటర్లను లోపలికి పంపి నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో పక్క నిరసన తెలుపుతున్నా నూతన ఆస్తి పన్నుకు ఆమోదం తెలపడంతో కార్పొరేటర్లు పలువురు కౌన్సిల్‌ సమావేశ మందిరంలోనే బైఠాయించారు. రాత్రి 7 గంటల వరకు నిరసన తెలిపారు.

* నిరసన తెలిపే కార్పొరేటర్లకు తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు మద్దతుగా నిలిచారు. కొత్త విధానాన్ని వాయిదా వేయాలని, రెండేళ్ల తరువాత పన్నులు పెంచాలని కోరినా అధికార పక్షం పట్టించుకోకపోవడం దారుణమని తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు అన్నారు. అంతకు ముందు విపక్ష సభ్యులు మేయరు పోడియాన్ని చుట్టిముట్టి నినాదాలు చేశారు. నిరసనల మధ్యే కొత్త విధానానికి ఆమోదం తెలుపుతున్నట్లు మేయరు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ తెదేపా, జనసేన, వామపక్ష కార్పొరేటర్లు, నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, కొవ్వొత్తులు ప్రదర్శించి ఆందోళన చేశారు.

* విపక్షాల ఆందోళనల మధ్య మేయరు గొలగాని హరి వెంకట కుమారి నివాస గృహాలకు 0.12 శాతం ఆస్తి పన్ను నిర్ణయాన్ని ప్రకటించి, ఆమోదిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని