ఉద్యోగం లేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక
eenadu telugu news
Published : 15/09/2021 04:22 IST

ఉద్యోగం లేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక

మహిళ ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతున్న వరలక్ష్మి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)లో పొరుగు సేవల కింద నాలుగో తరగతి ఉద్యోగి (ఎఫ్‌ఎన్‌ఒ)గా పనిచేసిన మహిళ వరలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. ఉద్యోగం కోల్పోడం, అప్పులు తీరే దారి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వరలక్ష్మి కుటుంబం వెళ్లిపోయింది. ఆమెకు భర్త గౌరినాయుడు, శరణ్‌, తనూజ పిల్లలు ఉన్నారు. వీరంతా గాజువాకలో నివసిస్తున్నారు. తను ఉద్యోగం కోల్పోవడం, భర్తకు ఉద్యోగం లేకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. మరో పక్క అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఒత్తిడి పెరిగింది. నిద్ర మాత్రలు అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్న ఆమెను మంగళవారం ఉదయం సహచర ఉద్యోగులు కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు అందించిన చికిత్సతో ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తోందని సహచర ఉద్యోగులు తెలిపారు.

* నక్షత అనే పొరుగు సేవల సంస్థ ద్వారా మూడేళ్ల కిత్రం 66 మంది నాలుగో తరగతి ఉద్యోగులుగా కేజీహెచ్‌లో చేరారు. ఏడాది క్రితం ఏపీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చారు. గత నెల వరకు కేజీహెచ్‌లో సేవలందించారు. ఈనెల 1 నుంచి వీరి సేవలను ఆసుపత్రి వైద్యాధికారులు నిలిపివేశారు. కొనసాగింపునకు సంబంధించి వైద్య విద్యా శాఖ సంచాలకులు (డీఎంఈ) కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో వీరి సేవలను నిలిపివేశామని ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. వరలక్ష్మి ఆత్మహత్యాయత్నం ఘటనను తెలుసుకున్న సహచర ఉద్యోగులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని