ఎమ్మెల్యే జోగి రమేష్‌ అరెస్టుకు డిమాండ్‌
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

ఎమ్మెల్యే జోగి రమేష్‌ అరెస్టుకు డిమాండ్‌


కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్న పల్లా, ఇతర నాయకులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాసంపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం దారుణమని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాడికి కారణమైన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మెల్యే ఒకరోజు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని, ఆయన్ని పోలీసులు ముందస్తుగా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.రైతు సమస్యలపై తెదేపా చేపట్టిన ఆందోళనలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జోగి రమేష్‌ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటిపై దాడి చేశారన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను ఖండించాల్సి వస్తే విశాఖకు వచ్చి ఆందోళన చేయాలన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. నాయకులు నజీర్‌, పుచ్చా విజయకుమార్‌, అనంతలక్ష్మి, రహంతుల్లా, తాతాజీ, గౌస్‌, గొలగాని వీరారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని