కానిస్టేబుల్‌పై కేసు నమోదు
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

కానిస్టేబుల్‌పై కేసు నమోదు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : ఒకరిపై దాడి చేసి, రూ.25 వేలు తీసుకున్నట్టు సిటీ టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్‌ వి.రాజేష్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ ఎస్‌.రాము వివరాల మేరకు... పెదగంట్యాడ దరి వియ్యపువానిపాలేనికి చెందిన రాజేష్‌, అదే వీధిలో ఉంటున్న ఎం.అప్పలరాజు స్నేహితులు. ఎక్కడైనా జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగితే అప్పలరాజు రాజేష్‌కు సమాచారం ఇచ్చేవాడు. దీనికి ప్రతిగా రాజేష్‌ అప్పుడప్పుడు అప్పలరాజుకు డబ్బులు ఇస్తూ సహాయ పడేవాడు. కొద్దిరోజులుగా అప్పలరాజు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. గురువారం రాత్రి ఉక్కు బీసీగేటు సమీపంలో అతను మరికొందరు కలిసి పేకాట ఆడుతున్నట్టు రాజేష్‌కు సమాచారం అందింది. నిందితులను పట్టుకునేందుకు ద్విచక్ర వాహనంపై రాజేష్‌ బయలుదేరాడు. ఇంతలో అటువైపు నుంచి కారులో వస్తున్న అప్పలరాజుని రాజేష్‌ అడ్డగించి...దాడి చేసి, రూ.1.40 లక్షలు బాకీ ఇవ్వాలంటూ, బలవంతంగా జేబులో ఉన్న రూ.25 వేలను లాక్కున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అప్పలరాజు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ రాజేష్‌పై అయిదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యూపోర్టు సీఐ రాము ఆధ్వర్యంలో ఎస్‌ఐ మన్మథరావు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని