మూగజీవాల మృత్యుఘోష
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

మూగజీవాల మృత్యుఘోష

సంతోషిమాత గుడి వీధిలో దూడ మృతదేహాన్ని జేసీబీతో తరలిస్తున్న జీవీఎంసీ సిబ్బంది

అడివివరం, న్యూస్‌టుడే: అప్పన్న స్వామికి భక్తులు మొక్కుబడిగా సమర్పిస్తున్న కోడెదూడలు నిరాదరణకు గురై మృత్యువాతపడుతున్నాయి. కొన్ని రోజులుగా అడివివరం గ్రామంలోని వీధుల్లో ఎటుచూసినా కోడెదూడలు దర్శనమిస్తున్నాయి. నీరు, గడ్డి దొరికే విజినిగిరిపాలెం, పుష్కరిణి చెరువు పరిసర ప్రాంతాలతో పాటు నివాసాలుండే ప్రాంతాల్లో కొన్ని మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. శనివారం కూడా రెండు కోడెదూడలు మరణించాయి. గ్రామంలోని సంతోషిమాత గుడి వీధిలో ఒక కోడెదూడ మృతిచెందింది. పుష్కరిణి చెరువు నుంచి విజినిగిరిపాలెం వెళ్లే రహదారిలో కుక్కల దాడిలో మరో కోడెదూడ మృత్యు ఒడికి చేరింది. గ్రామంలో నిత్యం మూగజీవాల కళేబరాలను చూడాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం సిబ్బందికి మృతదేహాల తరలింపు అదనపు భారంగా మారింది. ఇలాగే కొనసాగితే గ్రామంలో అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతిరోజు గోవులు మరణిస్తుంటే ప్రభుత్వం, దేవస్థానానికి ఏమీ పట్టనట్టు ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మూగజీవాల మృత్యుఘోషకు అడ్డుకట్ట వేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని